భారత విమానాలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. 'కొవిడ్-19 మహమ్మారి కారణంగా.. భారత్ నుంచి వచ్చే విదేశీయుల్ని చైనాలోకి అనుమతించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయించాం. కాబట్టి భారత్‌లోని రాయబార కార్యాలయం అధికారులు చైనా వీసా, నివాస అనుమతులు కలిగిన వారికి ఆరోగ్య నిర్ధరణ దరఖాస్తులను ఇవ్వరు. ఈ నిబంధనలు చైనా దౌత్య, గౌరవ, సీ వీసాలు కలిగి ఉన్నవారిపై ప్రభావం చూపించవు. ఒకవేళ ఎవరైనా అత్యవసర సందర్శనకు వచ్చే వారు రాయబార కార్యాలయంలో వీసా దరఖాస్తు సమర్పించవచ్చు. కరోనా నేపథ్యంలో ఈ నిబంధనలు తాత్కాలికంగానే వర్తిస్తాయి' అని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
గతవారం దిల్లీ నుంచి వుహాన్‌కు ఎయిర్‌ఇండియా విమానంలో వెళ్లిన వారిలో 20 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే చైనా భారత విమానాలను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్రాగన్ దేశం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నవంబర్ 13 నుంచి డిసెంబర్ 4 వరకు చైనాకు ఎయిర్‌ఇండియా ఇప్పటికే షెడ్యూల్ చేసిన నాలుగు (వందేభారత్)విమానాలపై ప్రభావం పడనుంది. బెల్జియం, బ్రిటన్, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చే చైనాయేతర సందర్శకులకు సైతం ఇదే తరహా ప్రకటన జారీ చేసింది.
ఇదీ చూడండి: అధ్యక్ష పోరు: రాష్ట్రాల నిబంధనలతో ఫలితాల్లో తీవ్ర జాప్యం