స్వైన్‌ఫ్లూ వైరస్ జీ4 స్ట్రెయిన్ కొత్తదేమీ కాదని చెబుతోంది చైనా. అందరూ భావిస్తున్నట్టు అదంత సులభంగా మానవులు, జంతువులకు సోకదని తెలిపింది. మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం అస్సలే లేదని పేర్కొంది.
చైనాలో మరో వైరస్ వెలుగుచూసిందని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. సరికొత్త స్వైన్‌ఫ్లూ వైరస్ జీ4 అత్యంత ప్రమాదకరమని చైనాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒకటి పీఎన్‌ఏఎస్ అమెరికా జర్నల్‌లో ప్రచురించింది. జీ4 మనుషులకు వేగంగా వ్యాపించగలదని, మహమ్మారిగా మారే సామర్థ్యం ఉందని హెచ్చరించింది. ఐతే ఈ అధ్యయనాన్ని చైనా ఖండించింది.
జీ4 వైరస్ స్ట్రెయిన్‌పై మీడియాలో వచ్చిన వార్తలు అతిగా ఉన్నాయని, అందులో శాస్త్రీయత లేదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అధ్యయనంలో తీసుకున్న నమూనాల పరిమాణం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. పందుల్లో జీ4 స్ట్రెయిన్ ప్రమాదకరంగా మారుతుందని రుజువు చేసేందుకు సరైన ఆధారాలు చూపలేదని విమర్శించింది. ఈ వైరస్‌పై పందుల పరిశ్రమ, ప్రజారోగ్య శాఖలతో సెమినార్ నిర్వహించాకే విషయం చెబుతున్నామని స్పష్టం చేసింది.
జీ4 వైరస్ కొత్తదేమీ కాదని సెమినార్‌లో పాల్గొన్నవారు చెప్పారని పేర్కొంది చైనా. 2011 నుంచి చైనాలోని ఏజెన్సీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాయని పేర్కొంది. జీ4 వైరస్ మానవ దేహంలో అంత సులభంగా తన సంతతిని పెంచుకోదని, వ్యాధికి కారణం కాదని వివరించింది. అయితే కరోనా వైరస్ విషయంలోనూ మొదట్లో చైనా ఇలాగే మాట్లాడిన సంగతి గమనార్హం.
ఇదీ చూడండి: 'గల్వాన్ వీరులకు మెరుగైన చికిత్సనే అందిస్తున్నాం'