ఇంతవరకూ మనుషులకు పరిమితమైన కరోనా వైరస్ మొట్టమొదటి సారిగా ఓ పులికి సోకినందున... కేంద్ర జంతు ప్రదర్శనశాల ప్రాధికార సంస్థ(సీజెడ్ఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని 'జూ'ల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. అనుమానాలున్న జంతువుల శాంపిల్స్‌ను రెండు వారాలకొకసారి సేకరించాలని సూచించారు. ఈ మేరకు సీజెడ్ఏ కార్యదర్శి ఎస్పీ యాదవ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఓ లేఖ రాశారు.
అమెరికా న్యూయార్క్‌లోని బ్రాంక్స్ 'జూ'లో నదియా అనే ఓ ఆడ పులికి కొవిడ్-19 సోకింది. ఈ నేఫథ్యంలో దేశంలోని అన్ని 'జూ'లు అప్రమత్తతతో వ్యవహరించాలని, 24 గంటలూ సీసీటీవీ ద్వారా జంతువుల ప్రవర్తనను పర్యవేక్షించాలని ఆదేశించారు యాదవ్.
" క్షీరదాల్లో ముఖ్యంగా పిల్లులు, ముంగీసలు, కోతులపై అత్యంత శ్రద్ధ వహించాలి. అనుమానమున్న జంతువుల శాంపిల్స్‌ను రెండువారాలకొకసారి సేకరించి.. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం గుర్తింపున్న జంతు ఆరోగ్య కళాశాలలకు పంపాలి. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ ఆనిమల్ డిసీస్, హరియాణాలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఎక్వైన్స్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇండియన్ వెటెరినరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు అనుమానిత జంతు శాంపిల్స్‌ను పంపొచ్చు. ఆరోగ్యం క్షీణించిన జంతువులను కచ్చితంగా ఐసోలేషన్‌లో ఉంచి క్వారంటైన్ చేయాలి."
- అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సీజెడ్ఏ లేఖ
జంతు సంరక్షకులు కేంద్రం లేదా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సూచనల మేరకు నడుచుకోవాలని, సరైన వ్యక్తిగత రక్షణ కవచం(పీపీఈ) లేకుండా జంతువులకు ఆహారం పెట్టకూడదని లేఖలో పేర్కొన్నారు యాదవ్.
ఇదీ చూడండి : కొన్ని దేశాల్లో తగ్గిన కరోనా ప్రభావం!