కరోనా మహమ్మారిపై చర్చే ప్రధాన అజెండాగా ఈ నెల 3, 4 తేదీల్లో ఐరాస ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది. ప్రపంచ దేశాధినేతల్లో కొందరు, కొవిడ్ టీకాను అభివృద్ధి చేస్తున్న సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. సమాజం, ప్రజలు, దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపిందనే విషయం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ట్రంప్‌కు దక్కని చోటు..
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, నేపాల్ ప్రధాని కేపీ శర్మఓలి, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు లేకపోవడం గమనార్హం. ట్రంప్‌కు బదులు ఆ దేశ ఆరోగ్య, మానవ సేవల మంత్రి అలెక్స్ అజార్.. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకానున్నారు.
వీరితో పాటు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధార్ పునావాలా డిసెంబర్ 4న ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా ప్రసంగించనున్నారు. బయోఎన్‌టెక్ సహవ్యవస్థాపకులు ఉగర్ సాహిన్, ఓజ్లెం టురేకీ, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అభివృద్ధికి నాయకత్వం వహించిన సరా గిల్బర్ట్ ఈ ఉన్నత స్థాయి భేటీలో మాట్లాడనున్నారు.
ఇదీ చూడండి: కరోనాకు మరో టీకా- ఒక్క డోసుతోనే వైరస్‌కు బ్రేక్!