కొద్దిరోజులుగా కంటిపై కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో అమెరికా తొలి అడుగు వేసింది. వైరస్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా ఓ వ్యాక్సిన్‌ను రూపొందించింది. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో తయారుచేసిన ఈ టీకాను నేడు తొలిసారిగా కొందరి యువకులపై ప్రయోగించారు.
ఎమ్ఆర్ఎన్ఏ-1273
ఆమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్ఐహెచ్), మసాచుసెట్స్ ఆధారిత బయోటెక్నాలజీ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ను.. ఎమ్ఆర్ఎన్ఏ-1273 కోడ్‌తో ఓ అభ్యర్థిపై ప్రయోగించారు. అదేవిధంగా వైరస్ సోకని 45 మంది యువ వలంటీర్లపై వేరు వేరు డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. అయితే వాళ్ల శరీరంలో వైరస్ లక్షణాలు లేనందున ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని వైద్యులు స్పష్టం చేశారు.
'వ్యాక్సిన్‌ను కనుగొనడంలో ఇది మొదటి ప్రయత్నం. కాబట్టి మా లక్ష్యాలు తొలిదశలోనే ఉన్నాయి. మా తొలి ప్రాధాన్యత భద్రతే.. ఆ తర్వాతే మిగతావి. మేం రోగ నిరోధక ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది పరీశించాలనుకున్నాం. నిర్దిష్ట ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ఉత్పత్తిచేసే ప్రతినిరోధకాలను తయారుచేయాలి.'
- డాక్టర్ లిసా జాక్సన్, కైసర్ పర్మనెంటె విచారణాధికారి
12 నుంచి 18 నెలల సమయం..
సియాటెల్‌లోని కైసర్ పర్మనెంటె వాషింగ్టన్ ఆరోగ్య పరిశోధనా సంస్థ వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్రయోగానికి అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిధులు సమకూరుస్తోంది. అయితే ఏ వ్యాక్సిన్ అయినా పూర్తిస్థాయిలో పనిచేయాలంటే దానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలవ్యవధి పడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: సరిహద్దుల మూసివేత