గత డిసెంబర్‌లో చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి.. ఫిబ్రవరి నుంచి ప్రపంచంపై ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. 8 నెలలు తిరిగే సరికి 4 కోట్ల మందికి పైనే సోకి 11 లక్షల మందికిపైగా బలితీసుకుంది. వీరిలో ఎక్కువగా పేదలే ఉన్నారు. కరోనాను మహమ్మారిగా ప్రకటించిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోని ఔషధ సంస్థలు.. వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన వివరాల ప్రకారం వివిధ దేశాల్లో 42 కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉండగా మరో 151 క్యాండిడేట్లు ప్రీక్లినికల్ దశలో ఉన్నాయి. ఆ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. అవి సమర్థంగా పనిచేయాలంటే వాటిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్యనే నిల్వచేయాలి.
300 కోట్ల మందికి దూరం!
వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే కరోనాను ఎదుర్కోవడం కష్టం అన్నది డబ్ల్యూహెచ్ఓ సహా వైద్యనిపుణులు అందరూ చెబుతున్న విషయమే. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రపంచ మానవాళి మొత్తం ముప్పు నుంచి బయటపడ్డట్టా అంటే... కాదనే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ జనాభా 780 కోట్లు అయితే వారిలో దాదాపు 300 కోట్ల మందికి వ్యాక్సిన్ అందడం గగనమయ్యేలా ఉంది.
ఇదీ చదవండి- ప్రతిబంధకాలను అధిగమిస్తేనే వ్యాక్సిన్ పంపిణీ
కారణం... మౌలిక వసతుల లేమి. ఆఫ్రికా ఖండంలోని బుర్కినాఫాసో అనే దేశాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఆ దేశంలోని గంపెలా అనే నగరంలోని ఓ ఆస్పత్రిలో ఏడాది క్రితం రిఫ్రిజిరేటర్ చెడిపోతే ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ కారణంగా అక్కడి వారికి ఏ వ్యాక్సిన్ కూడా సకాలంలో అందడంలేదు. ఔషధ సంస్థ నుంచి సిరంజిలోకి వ్యాక్సిన్ చేరే వరకు దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు సరిపడా గొలుసుకట్టు శీతలీకరణ నిల్వ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలి.
మన దేశంలోనూ అంతే!
బుర్కినాఫాసో శివార్లలోని ఓ ఆస్పత్రి అక్కడున్న 11 వేల మందికి వైద్య సేవలు అందిస్తూ ఉంటుంది. ఆ ఆస్పత్రిలో రిఫ్రిజిరేటర్ పాడైన తర్వాత టెటానస్, యెల్లోఫీవర్, ట్యుబర్‌క్యులోసిస్‌తో పాటు ఇతర సాదారణ జబ్బులను నిరోధించేందుకు అవసరమైన వ్యాక్సిన్‌లను నిల్వచేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. అవి కావాలంటే పక్కనే పట్టణానికి బైక్‌పై 40 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాలి. మట్టిరోడ్లు కాబట్టి వెళ్లి రావడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ పేదలు ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాలంటే... కాలినడకనే మండుటెండలో గంటలకొద్దీ నడవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కరోనా వ్యాక్సిన్ అందడం చాలా కష్టం.
ఇదీ చదవండి- కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం కార్యాచరణ
ఇది ఒక్క బుర్కినాఫాసో పరిస్థితే కాదు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే మన దేశంలో చాలా రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఆ ప్రాంతాలు చేరుకోవడానికి ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు. పుట్టిన శిశువులకు సాధారణ టీకాలు సకాలంలో అందడమే క్లిష్టంగా ఉంటుంది.
15 వేల కార్గో విమానాలు అవసరం!
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టీకా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రతి ఒక్కరికీ అందించాలంటే మౌలిక వసతులపై భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాలి. లక్షల సంఖ్యలో సౌర శక్తితో నడిచే కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించాలి. రిఫ్రిజిరేటర్లలో పెట్టిన వ్యాక్సిన్... సమర్థంగా పనిచేసేందుకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. నిల్వ కేంద్రాల నుంచి ఊర్లకు త్వరితగతిన తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గాలు ఉండాలి. వ్యాక్సిన్‌ను ఊర్లలో ఉన్నవారికి ఇవ్వాలంటే మొబైల్ రిఫ్రిజిరేటర్లు కూడా సిద్ధం చేయాలి. కోల్డ్ చైన్ ఎక్కడా తెగిపోకుండా చర్యలు తీసుకున్నప్పుడే వ్యాక్సిన్ అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 780 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలంటే కనీసంగా 15 వేల వరకు కార్గో విమానాలు కావాలని జర్మన్ సంస్థ డీహెచ్ఎల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ స్థాయిలో విమానాలను అన్ని దేశాలూ సమకూర్చుకోగలవా అన్నది కూడా చూడాలి. ఇంతగా మౌలిక వసతుల కల్పన.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాధ్యమేనా అన్నది క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాలు.
ఇదీ చదవండి- కరోనా వ్యాక్సిన్ కూటమిలో చైనాకు చోటు!
పీపీఈ కిట్లే లేవు
కరోనా నియంత్రణ విషయంలోనే గమనిస్తే పేద దేశాలు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పేదలకు సరిగ్గా కరోనా చికిత్స అందిన దాఖలాలు చాలా స్వల్పం. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు తప్పనిసరిగా పనికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో ఆస్పత్రి పాలైన వారిలో చాలా మందికి అవసరమైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ కూడా అందని దుస్థితి. పరీక్షల కోసం అవసరమైన ప్రయోగశాలలు చాలా దేశాల్లో లేవు. తొలినాళ్లలో భారత్ వంటి దేశాల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించే సిబ్బందికి, చికిత్స అందించే వైద్య సిబ్బందికి కూడా సరిపడా పీపీఈ కిట్లు అందలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేక చోట్ల ఇదే స్థితి ఉంది. అందుకే పరీక్షలు చాలా దేశాల్లో మందకొడిగా సాగుతున్నాయి.
పేద దేశాలే కాదు
ధనిక దేశాలకు కూడా అనేక సమస్యలున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో మైనస్ 70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఇలాంటి ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు మౌలిక వసతులపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి. మధ్య ఆసియా, భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో వ్యాక్సిన్‌ను సమర్థంగా నిల్వచేసేందుకు అవసరమైన మౌలికవసతులు సహా ముందస్తు ప్రణాళికలు లేవని నిపుణులు చెబుతున్నారు.
డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ ప్రణాళికలు
బుర్కినాఫాసో వంటి దేశాల్లోని పేదలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు 'కొవాక్స్' పేరిట డబ్ల్యూహెచ్ఓ, గవి వ్యాక్సిన్ కూటమి పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన కరోనా వ్యాక్సిన్లను ఆర్డర్లపై సేకరించి సమంగా పంపిణీ చేయడం కొవాక్స్ లక్ష్యం. కరోనా వెలుగు చూసిన తొలి రోజుల్లో మాస్కుల కొరత, పీపీఈ కిట్ల లేమి, నల్ల విపణిలోకి తరలింపు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటన్నింటికీ తావులేకుండా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు యూనిసెఫ్ ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించుకోవడం పేద దేశాలకు కాస్త ఉపశమనం ఇచ్చే విషయం.
అడ్వాన్స్‌డ్ పరీక్షల దశలో ఉన్న ఫైజర్ అనే వ్యాక్సిన్ తయారీ సంస్థ తన వ్యాక్సిన్ క్యాండిడేట్లను భద్రంగా రోగి వరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన కేస్‌లను తయారు చేసుకుంది. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలతో పాటు జపాన్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. కొవాక్స్‌తోనూ ఒప్పందానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది.
ఇదీ చదవండి- 'కరోనా టీకా పంపిణీకి సమర్థవంతమైన ప్రణాళిక అవసరం'
ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ ఎంత త్వరితగతిన అందుబాటులోకి వచ్చినా అది అవసరమైన వారికి చేరేందుకు మౌలికవసతుల కల్పన కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. పేద, మధ్యాదాయ దేశాలు ఈ స్థాయిలో ఇప్పటికిప్పుడు వ్యయం చేయడం కష్టమైన తరుణంలో దాదాపు 300 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందడం కష్టమే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి- కరోనాకు ఏటా వ్యాక్సిన్ వేయించుకోవాలా?