అమెరికాలో నల్లజాతీయుడి మరణానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళన తెలుపుతున్నారు. కరోనా వైరస్‌తో అత్యంత దారుణంగా ప్రభావితమైన దేశంలో ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని అధికారులు అభిప్రాపడుతున్నారు.
భౌతిక దూరం లేదు...
అమెరికాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడే ప్రజలు బీచ్‌లలో గుమిగూడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక లాక్డౌన్ ఆంక్షలు సడలిచడం వల్ల బార్లు, రెస్టారెంట్లుతో పాటు అనేక ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. భౌతిక దూరం నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు ప్రజలు. వీటికి తోడు తాజా నిరసనలతో దేశవ్యాప్తంగా కరోనా రెండోసారి విజృంభించే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఎలాంటి లక్షణాలు లేని వైరస్ బాధితులతో ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు నిరసనకారులతో కలిస్తే.. వైరస్ వ్యాప్తి ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ పరిణామాలపై అట్లాంటా మేయర్ కీష లాన్స్ బాటమ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇంకా కరోనా ఉందని.. దానికి జాతీతో సంబంధం లేదని హెచ్చరించారు. నల్ల- తెల్ల జాతీయులు అన భేదం లేకుండా చంపుతోందని పేర్కొన్నారు. నిరసనల్లో పాల్గొన్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
నల్ల జాతీయుడి మరణ ఘటన జరిగిన మిన్నెపొలిస్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. నిరసనకారుల వల్ల కొత్త కేసులు భారీగా నమోదవుతాయని ఆ రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ తేల్చిచెప్పారు. అయితే పరిస్థితి నుంచి లబ్ధి పొంది.. తమను ఎవరూ గుర్తించకుండా ఉండటానికే నిరసనకారులు మాస్కులు ధరిస్తున్నారని మిన్నెసొటా గవర్నర్ ఆరోపించారు.
వైరస్ భయాలు ఉన్నప్పటికీ నిరసనకారులు వెనకడుగు వేయడం లేదు. ఇది తమ జీవితాలకు సంబంధించిన విషయమని చెబుతున్నారు.
"కరోనా సంక్షోభంలో మా ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ(నిరసనల్లో) ఉండటం సరైన విషయం కాదు. అది మాకు కూడా తెలుసు. కానీ నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం నేను యుద్ధం చేయాలి."
-- స్పెన్స్ ఇన్‌గ్రామ్, అట్లాంటాలోని నిరసనకారిణి.
ఇదీ జరిగింది...
మిన్నెపొలిస్‌లో ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సోమవారం రాత్రి ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ను అనుమానితుడిగా గుర్తించి విచారించేందుకు వెళ్లారు. సంకెళ్లు వేసి జార్జ్ మెడపై ఓ పోలీసు అధికారి మోకాలు బలంగా ఉంచాడు. ఊపిరి తీసుకోలేక జార్జి ప్రాణాలు కోల్పోయాడు. ఆ పోలీసును అధికారులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:- కరోనా చావులు, నిరసన జ్వాలలు... అమెరికాకు ఏమైంది?