కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదని ఐక్యరాజ్యసమితి ఉద్ఘాటించింది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా, వాటి ప్రాంతీయ అనుబంధ సంస్థలకు సంబంధించిన సమూహాలను అనుమతించకూడదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పష్టం చేశారు.
కొవిడ్-19 సంక్షోభం..
'వర్చువల్ కౌంటర్ టెర్రరిజం వీక్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న గుటెర్రస్.. ఇరాక్, సిరియా దేశాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని పునరుద్ఘాటించారు. డిజిటల్ సాంకేతికత, సైబర్ దాడులు, బయో టెర్రరిజంతో పాటు కొవిడ్ వ్యాప్తి కూడా ఉగ్రవాదులకు వరంగా మారిందని అందోళన వ్యక్తం చేశారు.
'ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులను అంచనా వేయడం తొందరపాటు చర్యే అవుతుంది. కానీ ఈలోగా ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా, వాటి ప్రాంతీయ అనుబంధ సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. వైరస్ తరహాలోనే ఉగ్రవాదం కూడా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది. అయితే సమష్టిగా పోరాడుతూ, ఆచరణాత్మక పరిష్కార మార్గాలను కనుక్కోవాలి.'
- ఆంటోనియో గుటెర్రస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
వినూత్నంగా ప్రతిస్పందిస్తేనే..
ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, తీసుకునే నిర్ణయాలు రానున్న ఏడాది హై లెవల్ కౌంటర్ 7వ ద్వివార్షిక సమీక్షకు తోడ్పాటునందిస్తాయని గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద ధోరణులను అన్ని దేశాలు నిశితంగా పరిశీలించాలని సూచించిన ఆయన.. వారిపై వినూత్నంగా ప్రతిస్పందించాలని కోరారు. కొవిడ్-19 భద్రతా చర్యల్లో భాగంగా ఐరాస సభ్యదేశాలు తమ అనుభవాలను పంచుకొని.. సమాచార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'మాస్క్ ధరించడం తప్పనిసరిపై ఆదేశాలు ఇవ్వలేం'