డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో.. టీకా తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకునే దిశగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోద్రిగో డుటెర్టే కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించేవారిని ఇళ్లను వీడి బయటకు వచ్చేందుకు అనుమతించబోమని బుధవారం రాత్రి హెచ్చరించారు. డెల్టా వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పదని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకోని వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా.. చట్టం లాంటివి ఏమీ లేకపోయినా... దీనిపై న్యాయస్థానాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్దమేనని రోద్రిగో తెలిపారు. "వ్యాక్సిన్ తీసుకోరా అయితే.. మంచిది. మీరు ఎప్పుడైనా మరణిస్తారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. మరోవైపు ఫిలిప్పీన్స్‌లో టీకా కొరత సమస్య వేధిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 70 లక్షల మంది రెండు డోసుల టీకా తీసుకోగా.. 1.10కోట్ల మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు.
అమెరికాలో ఆఫర్...
వైరస్ కట్టడి కోసం ఎక్కువ మందికి టీకా వేసేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది. అయితే.. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ మీద ఉన్న అపోహల కారణంగా టీకా తీసుకునేందుకు ముందుకు రావటం లేదు. దాంతో పలు రాష్ట్రాలు టీకా తీసుకునేవారి కోసం తాయిలాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా.. న్యూయార్క్ నగరంలో టీకా తీసుకున్నవారికి 100 డాలర్లను అందిస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు.
"వ్యాక్సినే పరిష్కారం. కొవిడ్‌కు సంబంధించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుతాం. కానీ, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడనట్లైతే.. పరిష్కారం గురించి మట్లాడనట్లే. మళ్లీ సాధారణ పరిస్థితులు కావాలంటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే."
-బిల్ డీ బ్లాసియో, న్యూయార్క్ మేయర్.
ఇప్పటివరకు న్యూయార్క్‌లో 99లక్షల టీకా డోసులు పంపిణీ చేశామని న్యూయార్క్ మేయర్ డీ బ్లాసియో చెప్పారు.
మళ్లీ మాస్కులు
మరోవైపు, అమెరికా సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తన మార్గదర్శకాలను సవరించింది. టీకా తీసుకున్నవారికి మాస్కులు అవసరం లేదని గతంలో సూచించిన సీడీసీ.. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న చోట ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని తాజాగా స్పష్టం చేసింది.
వారికి టీకా తప్పనిసరిపై నేడే ప్రకటన!
డెల్టా వైరస్ విజృంభణ తీవ్రమవుతున్న నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా చూపించేలా నిబంధనలు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. టీకా తీసుకున్నట్లు ఆధారాలు చూపించకపోతే.. కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదా మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసేలా ఆంక్షలు విధించనుంది. బైడెన్ సర్కారు ఈ మేరకు విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీకా తప్పనిసరి నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. తమ నివాస ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తితో సంబంధం లేకుండా ఈ రూల్‌ను అమలు చేయనున్నారు. దీనిపై తుది నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. గురువారమే ప్రకటించనున్నారని సమాచారం.
ఇదీ చూడండి: 'ఆస్ట్రాజెనెకా రెండో డోసుతో ఆ ముప్పు లేనట్లే'
ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ వేసుకోలేదా? అయితే.. మీకు స్వాగతం'