Pfizer covid pill: కరోనాపై పోరాటంలో అమెరికా కీలక మైలురాయిని చేరుకుంది. కొవిడ్ చికిత్సకు ఓ మాత్రను అధికారికంగా ఆమోదించింది. ఫైజర్ సంస్థ 'పాక్స్లోవిడ్' పేరుతో దీన్ని తయారు చేసింది. కరోనా బారినపడిన రోగులు ఈ మాత్రను తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం 90 శాతం తగ్గుతుంది. మరణం ముప్పు దాదాపు ఉండదు. ఇంతటి కీలక ఔషధాన్ని అమెరికావ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 2 లక్షలకుపైగా కేసులు వెలుగు చూస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఫైజర్ మాత్ర గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తోంది.
ఫైజర్ మాత్రతో కరోనా చికిత్సలో ఎలాంటి మార్పులొస్తాయి?
అమెరికాలో కరోనా చికిత్సకు ఇప్పటివరకు యాంటీబాడీ డ్రగ్స్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. వీటిని ఐవీ లేదా ఇంజెక్షన్ ద్వారా రోగులకు ఇస్తున్నారు. వీటి ధర కూడా అధికం. పాక్స్లోవిడ్ మాత్రతో కరోనా చికిత్స సులభతరం అవుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. నోటి ద్వారా ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుంది.
Pfizer paxlovid pill
ఏ మేర ప్రభావం చూపుతుంది?
కరోనా సోకిన రోగులకు ఈ మాత్రను ఇస్తే వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్లు ట్రయల్స్‌లో తేలింది. ఆస్పత్రిలో చేరే అవకాశాలు 90 శాతం తగ్గుతాయి. వ్యాధి తీవ్రమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాదాపు ఉండదు.
మెర్క్ తయారు చేసిన కరోనా మాత్రకు త్వరలోనే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(FDA) ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫైజర్ మాత్రతోనే వైరస్ సోకిన వారికి ఇంట్లోనే చికిత్స అందించనున్నారు.
ఎవరెవరు ఈ మాత్రను తీసుకోవచ్చు?
కరోనా పాజిటివ్‌గా తేలిన పెద్ద వయస్కుల వారు, 12ఏళ్లు పైబడిన పిల్లలు వైద్యుల సూచన మేరకు ఈ మాత్రను తీసుకోవాలి. ఊబకాయం, గుండె జబ్బులు ఉన్న కరోనా రోగులకు కూడా ఈ మాత్రతో చికిత్స అందించవచ్చు. అయితే 12 ఏళ్లు పైబడిన పిల్లలు కనీసం 40కిలోల బరువు ఉంటేనే ఫైజర్ మాత్ర తీసుకోవాలి.
Pfizer pill news
ఒమిక్రాన్‌పై ప్రభావం చూపుతాయా?
ఫైజర్ మాత్రతో పాటు మెర్క్ అభివృద్ధి చేస్తున్న కరోనా మాత్ర కూడా ఒమిక్రాన్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆందోళనకరమైన వైరస్ ఉత్పరివర్తనాలకు కారణమయ్యే స్పైక్ ప్రోటీన్‌ను ఇవి లక్ష్యంగా చేసుకోవని పేర్కొన్నారు.
ఈ మాత్రలు ప్రపంచం మొత్తానికి అందుతాయా?
ప్రపంచవ్యాప్తంగా 1,80,000 మందికి చికిత్స అందించేందుకు సరిపడా స్టాక్ మాత్రమే ప్రస్తుతం ఫైజర్ వద్ద ఉంది. ఇందులో 60,000-70,000 వేల మందికి అవసరమైన ఔషధాలను అమెరికాకు కేటాయించింది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలకు వీటిని సరఫరా చేయనుంది. మాత్రల తయారీకి 9నెలల సమయం పడుతుండటం వల్లే తక్కువ మోతాదులో ఔషధాలు ఉన్నాయని ఫైజర్ తెలిపింది. వచ్చే ఏడాది ఆ సమయం 50శాతం వరకు తగ్గిస్తామని పేర్కొంది.
కోటి మంది చికిత్సకు సరిపడా ఔషధాలు సరఫరా చేయాలని ఫైజర్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 కోట్ల మందికి సరిపడేలా మాత్రలను ఉత్పత్తి చేస్తామని ఫైజర్ తెలిపింది.
paxlovid pill
వ్యాక్సిన్ అవసరం లేదా?
కరోనా నుంచి రక్షణకు టీకానే అత్యుత్తమ మార్గమని నిపుణలు స్పష్టం చేశారు. అయితే అమెరికాలో ఇంకా 4కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోనందున ప్రభావవంతమైన మాత్రలను వినియోగిస్తే భవిష్యత్తులో మరో వేవ్ రాకుండా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఫైజర్ మాత్ర సవాళ్లు?
ఈ మాత్ర తీసుకోవాలంటే కరోనా పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి. అయితే వైరస్ లక్షణాలు బయటపడిన ఐదు రోజుల్లోపు దీన్ని తీసుకుంటేనే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ట్రయల్స్‌లో తేలింది. కరోనా లక్షణాలు ఉండి టెస్టు చేయించుకునేందుకు ఆలస్యమయ్యేవారు, డాక్టర్‌ను సంప్రదించలేని వారు ఈ మాత్రను సరైన సమయంలో పొందలేకపోయే అవకాశముంది. పాజిటివ్‌గా తేలిన ఐదు రోజుల్లోపు ఈ మాత్రను తీసుకోలేకపోతే ఆ తర్వాత దాని ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెప్పారు.
Pfizer pill for corona treatment
ట్రయల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి?
2,250మందిపై చేసిన ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన అనంతరమే పాక్స్లోవిడ్ మాత్రకు ఎఫ్‌డీఏ అనుమతిచ్చింది. కరోనా లక్షణాలు బయటపడిన రోగులకు మూడు రోజుల్లోపు ఈ మాత్రను ఇవ్వగా.. 89శాతం మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తగ్గింది. ఒక్క శాతం రోగులు కూడా ఆస్పత్రిలో చేరలేదు. 30 రోజుల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో ఒక్కరు కూడా మరణించలేదు. అయితే డమ్మీ మాత్ర ఇచ్చిన కరోనా రోగుల్లో 6.5శాతం మంది ఆస్పత్రిలో చేరారు. 9 మంది మరణించారు.
చికిత్స కోర్సు ఎలా ఉంటుంది?
ఫైజర్ మాత్ర ఒక్క కోర్సు కోసం అమెరికా ప్రభుత్వం 500డాలర్లు చెల్లిస్తుంది. చికిత్సలో భాగంగా రోగులు మూడు మాత్రల చొప్పున రోజుకు రెండు సార్లు 5 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైజర్ మాత్రపై బైడెన్ ఏమన్నారు?
ఫైజర్ మాత్రకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలపడాన్ని కరోనాపై పోరాటంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వైరస్ నుంచి తీవ్ర ప్రభావం లేకుండా అమెరికన్లు ఇక ఇంటి నుంచే సులభంగా చికిత్స తీసుకోవచ్చన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈ ఔషధం పంపిణీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: రోజూ లక్షల్లో కేసులు- కరోనా పరీక్షల కోసం కిలోమీటర్ల క్యూ