అమెరికా రక్షణ శాఖ భవన సముదాయం.. పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం రేగింది. మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన ఓ పోలీసు అధికారి ప్రాణాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. ఇదే ఘటనలో పోలీసు కాల్పుల్లో ఓ అనుమానితుడు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పెంటగాన్ వద్ద కొద్దిసేపు లాక్డౌన్ విధించారు. మెట్రో సబ్వే రైళ్లను దారిమళ్లించారు. పెంటగాన్ సమీపంలో జరిగిన హింసాకాండలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
లాక్డౌన్ విషయాన్ని పెంటగాన్ ధ్రువీకరించింది. పోలీసు చర్య కారణంగా ఆంక్షలు విధించినట్లు తెలిపింది. అనంతరం కాసేపటికి లాక్డౌన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది.
పెంటగాన్ ప్రయాణ కేంద్రంలోని మెట్రో బస్ ప్లాట్ఫాం వద్ద ఈ ఘటన జరిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు. పెంటగాన్ భవనానికి ఇది సమీపంలోనే ఉంది. పలువురు బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు అర్లింగ్టన్ కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే వీరు బుల్లెట్లు తగలడం వల్లే గాయపడ్డారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
తమ రిపోర్టర్ ఒకరు కాల్పుల శబ్దాన్ని విన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కొద్దిసేపు తర్వాత మరోసారి కాల్పులు జరిగినట్లు తెలిపింది. పోలీసులు 'షూటర్' అంటూ అరవడాన్ని మరో జర్నలిస్ట్ విన్నారని పేర్కొంది.