అమెరికాలో కొవిడ్ విధ్వంసానికి కేంద్ర బిందువుగా ఉన్న న్యూయార్క్ నగరం జూన్ చివరి వరకు లాక్డౌన్లోనే కొనసాగనున్నట్లు మేయర్ బిల్ డి బ్లాసియో తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను మే 15 నుంచి తెరవనున్నప్పటికీ ప్రధాన నగరం మాత్రం లాక్డౌన్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
న్యూయార్క్లో కొద్ది రోజులుగా బీభత్సం సృష్టించిన కరోనా ప్రస్తుతం శాంతిస్తోంది. రోజూవారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. ఐసీయూ బాధితులతో పాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా నియంత్రణలోకి వస్తోంది. అయితే వైరస్ తీవ్రత మరింత తగ్గాల్సి ఉందన్నారు మేయర్ బిల్.
"కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు మేము సిద్ధంగా లేము. వైరస్ తీవ్రత క్రమంగా తగ్గితే లాక్డౌన్ నిబంధనల్ని జూన్ నుంచే సడలిస్తాం."
-బిల్ డి బ్లాసియో, న్యూయార్క్ నగర మేయర్
రాష్ట్రంలో సడలింపు
న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ను సడలించనున్నట్లు తెలిపారు. ఫింగర్ లేక్, సదరన్ టైర్, మొహాక్ వాలే ప్రాంతాలు లాక్డౌన్ సడలింపు కోసం పరిశీలించే ఏడు మెట్రిక్ సూచీల్లో మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. తొలి దశ సడలింపుల్లో భాగమైన భవన నిర్మాణాలు, తయారీ, హోల్సేల్ వస్తు సరఫరా, రిటైల్, వ్యవసాయం, చేపల పెంపకం వంటివి చేపట్టవచ్చని స్పష్టం చేశారు.
నార్త్ కౌంటీ, సెంట్రల్ న్యూయార్క్ ప్రాంతాలు ఏడు మెట్రిక్లలో ఆరు మెట్రిక్ సూచీలను అందుకున్నట్లు క్యూమో తెలిపారు. ఈ వారాంతానికి అవి కూడా పునఃప్రారంభానికి సిద్ధమవుతాయని అన్నారు. దీంతో పాటు వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండే కార్యక్రమాలను మే 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనుమతించనున్నట్లు వెల్లడించారు.
న్యూయార్క్ కేంద్రంగా కొవిడ్
న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,37,055 వైరస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం 26 వేలకు పైగా ప్రజలు మరణించారు. ఇందులో న్యూయార్క్ నగరంలోనే 1,83,662 కేసులు, 14,928 మరణాలు సంభవించాయి.
ఇదీ చదవండి: విలేకర్లతో ట్రంప్ వాగ్వాదం- సమావేశం మధ్యలోనే స్టాప్!