నిన్నటివరకు అంతరిక్ష యాత్ర అంటే అసాధ్యమనిపించేది. అయితే గగనపు అంచుల్లో విహరించే అద్భుత అవకాశాల్ని పలు సంస్థలు కల్పిస్తున్నాయి. డబ్బుంటే స్పేస్ టూర్‌ను సుసాధ్యం చేస్తున్నాయి. ఏయే సంస్థలు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? మీరూ తెలుసుకొండి మరి..
వర్జిన్ గెలాక్టిక్
వర్జిన్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ ఇటీవల వర్జిన్ గెలాక్టిక్ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో కమర్షియల్‌గా రోదసీ యాత్రలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాదిలో తొలి కమర్షియల్ అంతరిక్ష విమానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. విజేతకు రెండు టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నారట. అంతరిక్షయానం చేయాలన్న కోరిక ఉన్నవారు ఆగస్టు 31 లోపు వర్జిన్ గెలాక్టిక్ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 29 వరకు విజేతను ఎంపిక చేసి ఆ రెండు టికెట్లు ఇస్తారు. విజేత తనకు తోడుగా మరొకరిని వెంట తీసుకెళ్లొచ్చు.
ఇన్స్‌పిరేషన్-4
స్పేస్ ఎక్స్ సంస్థతో కలిసి అపర కుబేరుడు జేర్డ్ ఐసాక్‌మ్యాన్ ఇన్స్‌పిరేషన్-4 పేరుతో ఒక అంతరిక్షయాత్రను నిర్వహించబోతున్నాడు. తనతోపాటు మరో ముగ్గురు సామాన్యులను రోదసీలోకి తీసుకెళ్తాడట. తన సీటు పోగా.. మిగతా మూడు సీట్లలో రెండింటిని సెయింట్ జూడ్ పిల్లల ఆస్పత్రికి కేటాయించాడు. ఆ ఆస్పత్రిలోనే క్యాన్సర్‌ను జయించిన 18ఏళ్ల యువతి ఇప్పటికే ఒక సీటును దక్కించుకుంది. మరో రెండు సీట్లలోనూ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచే ఇద్దరిని ఎంపిక చేయనున్నారు.
నాసా-ఆక్సియం
అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా), ఆక్సియం అనే సంస్థ కలిసి ప్రైవేటుగా అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టాయి. జనవరి 2022లో రోదసీలోకి వెళ్లబోయే యాక్స్-1 రాకెట్లో సీట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. త్వరలో యాక్స్-2తోపాటు మరో రెండు రోదసీ మిషన్లను ప్రారంభించనున్నారట. ఇప్పుడు టికెట్ మిస్ అయినవారు.. వాటిలో బుక్ చేసుకోవచ్చు. అయితే, ప్రయాణం, టికెట్లు ధర ఇతర వివరాలు తెలియడానికి సమయం పట్టొచ్చు. యాక్స్-1 రాకెట్‌లో టికెట్ ధర 55 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాతి రాకెట్లలో టికెట్ ధర యాక్స్-1 కన్నా కాస్త అటు ఇటుగా ఉండొచ్చు.
డియర్ మూన్ ప్రాజెక్ట్
జపాన్‌కు చెందిన యుసాకు మేజావా అనే బిలియనీర్.. నాసాతో కలిసి చంద్రుడిపైకి వెళ్లి రావడానికి ప్రణాళికలు రచించాడు. ఈ నేపథ్యంలో మేజావా తనతో పాటు మరో ఆరు నుంచి ఎనిమిది మందిని చంద్రుడిపైకి ఉచితంగా తీసుకెళ్తానని గతంలో ప్రకటించాడు. 'డియర్ మూన్' పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో పోటీ నిర్వహించి.. ఎంపికైన ఎనిమిది మందికి ప్రయాణం సహా ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని పేర్కొన్నాడు. ఎంపికైన అభ్యర్థులు చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన తర్వాత వారి ప్రయాణం.. చంద్రుడిపై అనుభవాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం డియర్‌మూన్ అధికారిక వెబ్‌సైట్ దరఖాస్తులను స్వీకరించట్లేదు. త్వరలో మరో ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి: