విదేశీ నిపుణులకిచ్చే హెచ్-1బీ వీసాల నేపథ్యంలో మార్కెట్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణిస్తూ యూఎస్సీఐఎస్(అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం) కుదుర్చుకున్న ఒప్పందాన్ని అగ్రరాజ్యం కోర్టు ఆమోదించింది. దీంతో హెచ్-1బీ ఉద్యోగులపై ఆధారపడుతున్న కంపెనీలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్స్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్.. అమెరికాలోని ఉద్యోగాలతో కూడిన ఓ జాబితాను రూపొందించింది. అయితే ఈ జాబితాలో మార్కెట్ రిసెర్చ్ ఎనలిస్ట్ ఉద్యోగం లేదని, అందువల్ల ఆ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణించలేమని యూఎస్సీఐఎస్ తేల్చి చెప్పింది. దీంతో హెచ్1బీ ఉద్యోగులపై ఆధారపడే కంపెనీలు నష్టపోయాయి.
తాజాగా.. కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు ఆమోదించిన ఒప్పందం ప్రకారం.. గతంలో కొట్టివేసిన తమ హెచ్1బీ పిటిషన్లను యూఎస్సీఐఎస్ పునరుద్ధరించేందుకు కంపెనీలు విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఈ ఒప్పందంతో వందలాది అమెరికా కంపెనీలు లబ్ధిపొందనున్నాయి. తాము ఎంపిక చేసుకున్న మార్కెట్ ఎనలిస్ట్లను వారు తిరిగి పొందగలుగుతారు.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్, వాన్డెర్ హౌట్ ఎల్ఎల్పీ- బెర్రి ఆపల్మెన్ అండ్ లిడెన్ ఎల్ఎల్పీ, కుక్ బాక్స్టర్ ఇమ్మిగ్రేషన్ ఎల్ఎల్సీ ఈ దావా వేసి ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. తాజా తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు బెర్రి ఆపిల్మెన్ అండ్ లిడెన్ ఎల్ఎల్పీకి చెందిన జెఫ్ జోసెఫ్. 'మనకున్న నిబంధనలు ఏచెబుతున్నాయి, వాస్తవిక ప్రపంచంలో కంపెనీలు తమ అభ్యర్థుల్లో ఏ లక్షణాలు చూసి చేర్చుకుంటాయి అన్న అంశాల మధ్య సరైన సమతుల్యం ఈ ఒప్పందం ద్వారా లభిస్తుంది. యూఎస్సీఐఎస్ ఇకనైన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా,' అని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:- హెచ్-1బీ వీసాలపై అమెరికా కోర్టు కీలక తీర్పు