కరోనా వైరస్‌పై విజయం సాధించి, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జాతి వివక్ష నిర్మూలనలో పురోగతి సాధించినట్టు వెల్లడించారు. నిరుద్యోగం విషయంలో సానుకూల నివేదిక అందిందని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో శుక్రవారం చేసిన ప్రసంగంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్.
అమెరికావ్యాప్తంగా సామాజిక అస్థిరత్వం నెలకొంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. నిరుద్యోగం విషయంలో అమెరికన్లలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. మాన్మౌత్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోల్స్ ప్రకారం.. 10మంది ఓటర్లలో కేవలం ఇద్దరే దేశం సరైన దిశలో అడుగులు వేస్తోందని భావించారు. ఇన్ని క్లిష్టపరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అగ్రరాజ్యాన్ని మరో నాలుగేళ్ల పాటు పాలించేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సహా అన్ని ప్రతికూల అంశాలపై పట్టు సాధిస్తున్నట్టు వెల్లడించారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.
జాతి వివక్షపై...
ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో చెలరేగిన నిరసనలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని, జాతి వివక్ష నిర్మూలనలో మంచి పురోగతి సాధించినట్టు వివరించారు. సమానత్వం పరంగా దేశం సరైన మార్గంలోనే నడుస్తోందని ఫ్లాయిడ్ కూడా అనుకునే వాడని అభిప్రాయపడ్డారు.
అమెరికా చరిత్రలో మరే ఇతర అధ్యక్షులు చేయనంతగా.. నల్ల జాతి అమెరికన్ల అభివృద్ధికి తాను కృషి చేసినట్టు వివరించారు. జాతికి సంబంధించిన విషయాల్లో ఆర్థికపరంగా పుంజుకోవడమే అత్యంత గొప్ప విషయమన్నారు.
ఆ రిపోర్టుతో...
ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ట్రంప్‌కు చిన్న ఉపశమనం కలిగించే విధంగా ఓ నివేదిక బయటకు వచ్చింది. గత నెలలో 2.5 మిలియన్(25లక్షలు) మందిని యజమానులు ఉద్యోగంలో చేర్చుకున్నట్టు ఆ నివేదిక పేర్కొంది. దీనిని వెంటనే అందిపుచ్చుకున్న ట్రంప్.. అన్ని సమస్యల నుంచి దేశం గట్టెక్కుతోందని వ్యాఖ్యానించారు.
విపక్షాలు ఫైర్...
అయితే అభివృద్ధివైపు ట్రంప్ ఎంత దృష్టిపెట్టాలనుకున్నా... విపక్షాలు మాత్రం ట్రంప్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నాయి. కరోనా వైరస్‌పై ట్రంప్ తీరును తప్పుబడుతున్నారు నేతలు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున పోటీ చేయాలనుకుంటున్న జో బిడెన్ వీటి నుంచి లబ్ధిపొందాలనుకుంటున్నారు. మిలియన్ల మంది అమెరికన్లు ఇంకా ఉద్యోగాలకు వెళ్లడం లేదని అంటున్నారు. ఇది దేవుడి మీద వదిలేసే విషయం కాదని.. కేవలం అధ్యక్షుడి వైఫల్యమేనని తేల్చిచెబుతున్నారు. కరోనా వైరస్‌ను అరికట్టడంపై ట్రంప్ ప్రదర్శించిన తీరుతోనే నిరుద్యగం పెరిగిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ ఇకనైనా బంకర్ల నుంచి బయటకు వచ్చి పరిస్థితులను స్వయంగా చూడాలని ఎద్దేవా చేశారు.
'నేను రాకపోతే.. ఇక అంతే'
అయితే విమర్శలను ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైరస్ కట్టడిలో తన వైఖరిని మరోమారు సమర్థించుకున్నారు. తాను చర్యలు చేపట్టకపోయుంటే.. 10లక్షలమంది ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు.
అనేక రంగాల్లో దేశం ఇప్పటికే పుంజుకుందని అభిప్రాయపడ్డారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇదొక గొప్ప విషయంగా అభివర్ణించారు. 'అగ్రరాజ్యం అభివృద్ధికి నేను ఒక్కడినే దిక్కు' అని.. అధ్యక్షుడిగా తనను తిరిగి ఎన్నుకోకపోతే.. దేశం మరింత కష్టాల్లోకి జారుకుంటుందని హెచ్చరించారు.