టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను భారత్ నిషేధించటాన్ని మరోమారు సమర్థించింది అమెరికా. టిక్‌టాక్ వంటి మొబైల్ యాప్‌లను నిషేధించటం.. చైనా నిఘా నుంచి తప్పించుకునేందుకు తీసుకున్న అతిపెద్ద ఆయుధంగా పేర్కొన్నారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగం.. టిక్‌టాక్, వీచాట్ వంటి చైనా యాప్‌ల నిషేధాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
"అలాంటి యాప్‌లను భారత్ ఇప్పటికే నిషేధించింది. వారు భారత్, అమెరికాలను కోల్పోతే.. కొన్ని పశ్చిమ యూరప్ దేశాలనూ కోల్పోతారు. అది చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేసే గూఢచర్యం, నిఘా పనుల నుంచి తప్పించుకునే పెద్ద ఆయుధం అవుతుంది. టిక్‌టాక్ చాలా వినోదాన్ని అందిస్తుంది. కానీ, అది మీ గుర్తింపు వివరాలను పొందుతుంది. వారు మీ వ్యక్తిగత, ప్రైవేటు సమాచారాన్ని సేకరిస్తారు. మీ స్నేహితులు, కుటుంబసభ్యులు సహా అన్ని సంబంధాలను గుర్తిస్తారు. ఈ సమాచారం మొత్తం నేరుగా చైనాలోని అతిపెద్ద సూపర్ కంప్యూటర్లకు చేరుతుంది. దాని ద్వారా మీ ప్రతి విషయాన్ని చైనా తెలుసుకుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి."
- రాబర్ట్ ఓబ్రెయిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
మారియట్‌ను హ్యాక్ చేసి, లక్షల మంది ప్రజల పాస్‌పోర్ట్ నంబర్లతో సహా వ్యక్తిగత డేటాను చైనా దొంగిలించిందని ఆరోపించారు రాబర్ట్. ఎక్స్పీరియన్ సహా ఇతర క్రెడిట్ రేటింగ్ సంస్థలు, ఆరోగ్య కేంద్రాలను హ్యాక్ చేసి చాలా సున్నితమైన క్రెడిట్ సమచారం, పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటింగ్ ద్వారా వారు త్వరలోనే అమెరికన్లు, ప్రపంచంలోని ప్రతిఒక్కరిపై సామాజిక క్రెడిట్ స్కోర్లను ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ, అది జరగనివ్వబోమని పేర్కొన్నారు ఓబ్రెయిన్
ఇదీ చూడండి: జాగ్తేరహో: సైబర్ నేరగాళ్లకు సరికొత్త ఆయుధంగా టిక్‌టాక్!