చరిత్రలో మానని గాయం లాంటి 9/11 దుర్ఘటన (9/11 Attack) జరిగి సెప్టెంబర్ 11తో 20 ఏళ్లు పూర్తవుతోంది. అగ్రరాజ్యానికి తలమానికం లాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) జంట సౌధాలు 2001 ఉగ్రదాడుల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. న్యూయార్క్‌లోని ఆ ప్రాంగణంలో మరికొన్ని అద్భుత నిర్మాణాలు ఆనవాలు లేకుండా పోయాయి. ఆనాటి దుర్ఘటనకు కళ్లకు గట్టే చిత్రాలతో సమగ్ర కథనం.
- ఈ ఘటనలో దాదాపు 3000 మంది మరణించారు. 25వేల మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న 91వేల మంది ఆరోగ్య సమస్యల బారినపడ్డారు.
- సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న 45 శాతం మందిని శ్వాస సంబంధిత, క్యాన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. వీరిలో అనారోగ్య సమస్యలతో దాదాపు 3,439 మంది ప్రాణాలు కోల్పోయారు. 412 మంది ఘటన జరిగిన తొలిరోజే ప్రభావితమై మరణించారు.
- ఈ ఘటన కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ప్రభుత్వ హెల్త్ స్కీమ్‌లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. గత ఐదేళ్లలో 16,000మంది ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవధిలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 185 శాతం పెరిగింది. లుకేమియా సాధారణ సమస్యగా మారింది. కొలన్, బ్లాడార్, క్యాన్సన్ వంటి రోగాలను ఇది అధిగమించింది.
- ఘటన జరిగి 20ఏళ్లు గడిచినప్పటికీ సహాయ సిబ్బందిలోని 15-20శాతం మంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లక్షణాలతో(PTSD) బాధపడుతున్నారు. దాదాపు 50 శాతం మంది మానసిక డిప్రెషన్, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
- ఇప్పటికే క్యాన్సర్, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న వీరిని కరోనా కాటేసింది. గతేడాది ఆగస్టు నాటికే వీరిలో 1,172 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఆరోగ్యం క్షీణించి 100 మందికిపై మరణించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారిలా చాలా మంది రానున్న 20-50 ఏళ్లలో క్యాన్సర్ బారినపడే ముప్పు ఉంది.
- ఈ ఘటన జరిగిన ఏడాది లోపే 2002 మే 31న వందేళ్లపాటు దీని గురించి చర్చ జరుగుతుందని అప్పటి న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గియులియానీ చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రజలు వస్తూనే ఉంటారని అభిప్రాయపడ్డారు.
- 2016 సెప్టెంబర్ 11న 15వ స్మారక దినోత్సవం సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ ఘటన జరిగి దశాబ్దంన్నర అయినప్పటికీ తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ నిన్నటిలానే ఉంటుందని వ్యాఖ్యానించారు.
- తమ ఆత్మగౌరవానికి ప్రతీక లాంటి ఆ అపురూప కట్టడాలు ఎక్కడైతే కూలిపోయాయో (గ్రౌండ్ జీరో), సరిగ్గా అక్కడే పునర్నిర్మించుకుని ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకోవాలని అమెరికా సంకల్పించింది.
- ఇప్పటికే 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్, 9/11 జాతీయ స్మారక మ్యూజియం, మెమోరియల్ ప్లాజా లాంటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అయితే మరికొన్ని ప్రతిపాదిత కట్టడాలు ఇప్పటికీ పూర్తికాకపోవడం ఒకింత వెలితి. ఆ నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తిచేసి విధ్వంసవాదం తలదించుకునేలా చేయాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష.
- 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత అత్యంత ఎత్తుతో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యం 2 వరల్డ్ ట్రేడ్ సెంటర్. 1,270 అడుగుల ఎత్తుతో 80 అంతస్తులు నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ భవనంలో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కార్యాలయాలకు అద్దెకు ఇవ్వనున్నారు. బ్రిటన్ ప్రముఖ ఆర్టిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఆకృతికి రియల్ ఎస్టేట్ దిగ్గజం ల్యారీ సిల్వర్‌స్టీన్‌కు చెందిన సంస్థ రూపునిస్తోంది. ప్రస్తుతం ఈ టవర్ నిర్మాణం పునాది దశలోనే ఉంది.
- రొనాల్డ్ ఓ పెరెల్మాన్ కళా సాంస్కృతిక కేంద్రాన్ని 2023లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక వేశారు. బడ్జెట్ అంచనాలు, ఆకృతులకు సంబంధించిన సమస్యలతో నిర్మాణంలో జాప్యం జరిగింది. చివరకు 2015లో పాలరాయి, పారదర్శకం కాని గాజుతో ఘనాకార(క్యూబ్) రూపంలో నిర్మించేలా ఖరారు చేశారు. నాటకాలు, సినిమాలు, నృత్యరూపకాలు, సంగీత కచేరీ తదితర ప్రదర్శనల కోసం థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. గోడలు, సీట్లను కోరుకున్నట్లు జరిపి థియేటర్ల సంఖ్యను మార్చుకునే సదుపాయంతో దీన్ని నిర్మించనున్నారు. బ్యాంకర్, ఇన్వెస్టర్ అయిన పెరెల్మాన్ 7.5 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చి ఈ కేంద్రానికి తన పేరును పెట్టే హక్కును పొందారు.
- సెయింట్ నికోలస్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి నిర్మాణాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. నిర్మాణ స్థలం, బడ్జెట్ అంచనాలపై విభేదాలతో ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. చివరకు 8.5 కోట్ల డాలర్ల బడ్జెట్‌ను ఖరారు చేశారు. చర్చి చుట్టూ ఉద్యానం ఉంటుంది. బైజంటైన్ శైలిలో చర్చి గోపురాన్ని నిర్మిస్తారు. గోడలకు మార్బుల్ క్లాడింగ్ (పలు వరుసలు) హంగులను అద్దనున్నారు.
- ట్విన్ టవర్లు కూల్చివేసినప్పుడు దాని శిథిలాలు పడి ధ్వంసమైన ఓ కార్యాలయ స్థలంలో 5 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం ఇంకా మొదలవ్వాల్సి ఉంది. ఐదేళ్లలో దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. 900 అడుగుల ఎత్తుతో నిర్మించే ఈ భవనంలో 1,325 అపార్ట్‌మెంట్లతో పాటు మరికొంత స్థలాన్ని కార్యాలయాలకు కేటాయించనున్నారు.
ఇదీ చదవండి: బైడెన్‌తో బాక్సింగ్ మ్యాచ్‌కు సై అంటున్న ట్రంప్