ETV Bharat / entertainment

హిందీ చిత్రసీమకు వాణీజయరాం దూరం.. కారణం ఇదేనా? - vani jairam passes away

వాణీ జయరాం సినీసాగర మథనంలో తేనె వాగులు, మేలిముత్యాలు, వెన్నెల సోన‌లు వుంటాయి. సంగీత జగాన సప్తస్వరాలే వసంత రాణులై.. ఆ పాటల్లో మయూరాల్లా నాట్యం చేస్తుంటాయి. అందుకే సినీ సంగీత ప్రపంచం ఆమెను 'అపర మీరా' అని గుర్తించింది. అందుకు తగినట్టుగానే ఆమె గళం.. శ్రోతల మనసులలో మార్దవమైన ముద్ర వేసింది. ఒక సమయంలో ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్​ పాట కంటే తన పాటే బాగుందని అనిపించుకున్న గాన కోకిల వాణీ జయరాం.. శనివారం తుదిశ్వాస విడిచారు.

vani jairam passes away
vani jairam passes away
author img

By

Published : Feb 4, 2023, 6:13 PM IST

ఆమె స్వరం పాటల పల్లకీకి పచ్చ కల్యాణం. సంగీత లక్ష్మికి నిత్య ఆరాధనోత్సవం. ఎన్నో వసంత వేళలు వచ్చి పోతున్నా... అనేక తరాలను, స్వరాలను ఆ గళం పరవశింప చేస్తూనే ఉంది. సినీ నేపథ్య గానాన్ని రాగరంజితం చేస్తూనే ఉంది. సంగీతంతో, నేపథ్య గానంతో ఆమెది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. సంగీత సరస్వతే ఆవహించిందా అన్నట్టు ఆ గానంతో మధుర తుషారాలు మనసును మృదువుగా సృపిస్తాయి. మధువనాలు మళ్లీ పూస్తుంటాయి. అలాంటి గాన కోకిల స్వరం మూగబోయింది. శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.

పాటలు పాడతానంటే వద్దన్నారు..
తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణీజయరాం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కచెల్లెళ్ల సంతతిలో వాణీజయరాం ఐదవ సంతానం. తల్లి పద్మావతి ప్రముఖ వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగార్‌ శిష్యురాలు. కుటుంబ సభ్యులందరికీ సంగీతమంటే ప్రాణం. తన అక్క.. కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్‌ వద్ద సంగీత శిక్షణ పొందుతూ వుంటే.. వాణీ కూడా ఆమెతోపాటు కీర్తనలు పాడుతుండేవారు. కుటుంబం మద్రాసుకు మకాం మార్చిన తర్వాత కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్‌.బాలసుబ్రమణియన్, ఆర్‌.ఎస్‌.మణిల శిష్యరికంలో కఠినమైన కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టారు. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు వాణి బాగా పాడేవారు. తన ఎనిమిదవ ఏటనే వాణీజయరాం సంగీత కచేరి నిర్వహించారు. చిన్నతనం నుంచీ హిందీ పాటలు రేడియో సిలోన్‌లో వినటం వాణీకి అలవాటు. నేపథ్యగాయనిగా ప్రయత్నం చేస్తానంటే తల్లి ఒప్పుకోలేదు. పెళ్లయ్యేదాకా ఆ ప్రయత్నం మానుకోమన్నారు.

రోజుకు 18 గంటలు సాధన..
మద్రాస్‌ క్వీన్స్‌ మేరీ కాలేజిలో పట్టా పుచ్చుకున్న తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తొలుత మద్రాసు, తర్వాత హైదరాబాదులో ఉద్యోగం చేశారు వాణీ. 1960లో జయరాంతో వివాహానంతరం వాణీ మకాం బొంబాయికి మారింది. వ్యాపార ప్రకటనలకు 'జింగిల్స్‌' పాడుతూ వాణీజయరాం బిజీగా ఉంటూనే.. ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ వద్ద హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో శిక్షణ పొందారు. ఈ శిక్షణ ఎంత కఠినమైందంటే రోజుకి 18 గంటలు 'తుమ్రి భజన్‌'లో మెళకువలు 'గజల్‌' ప్రక్రియలో సాంకేతికత నేర్చుకొవటానికే సరిపోయేది. ఈ శిక్షణా కాలంలోనే వాణీజయరాం తన మొట్టమొదటి హిందుస్తానీ క్లాసికల్‌ కచేరిని.. మార్చి 1, 1969న బొంబాయిలో ఏర్పాటుచేసి సభికుల్ని అలరించి.. విద్వాంసుల్ని ఆకట్టుకున్నారు.

మొదటి అవకాశం వచ్చిందిలా.. వాణీ మెరిశారలా..!
ఆ కచేరి జరిగిన సమయంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు వసంత దేశాయిని కలిశారు వాణీజయరాం. వినూత్నమైన ఆమె కంఠస్వరానికి ముగ్దుడైన వసంత దేశాయి.. వాణీజయరాంతో తొలుత కుమార గంధర్వతో ఒక మరాఠీ యుగళ గీతాన్ని పాడించారు. ఆ వెంటనే హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'గుడ్డి' (1971) సినిమాలో మూడు పాటలు పాడించారు. వసంత దేశాయ్‌.. మేఘమల్హర్‌ రాగంలో స్వరపరచిన 'బోల్‌ రే పపీ హరా, పపి హరా'ను తన తొలి హిందీ పాటగా వాణీజయరాం 22 డిసెంబరు 1970న పాడారు. ఆ పాటకు ఐదు అవార్డులే కాక, ప్రతిష్టాత్మక 'తాన్సేన్‌ సమ్మాన్‌' అవార్డు కూడా వచ్చింది. తరువాత వాణీ.. ఎన్నో మరాఠీ పాటలు పాడారు. పండిట్‌ కుమార గంధర్వతో కలిసి యుగళ గీతాలు పాడారు.

ఆమెకు గురువే దైవం..
వసంత దేశాయితో మహారాష్ట్ర మొత్తం పర్యటించి గొప్ప మరాఠీ పాటల రుచులను ప్రజలకు చేరువ చేశారు. పాఠశాల విద్యార్ధులకు మరాఠీ సంగీతంలో శిక్షణ ఇచ్చారు. నిద్రలేవగానే ఆమె నమస్కరించేది దేవుడి పటంతో పాటు మొదటి గురువు వసంత దేశాయి ఫోటోకే. అంతేకాదు ఆయన ఫొటోకు నిత్యం పూజ కూడా చేస్తుంటారు వాణీ. 'గుడ్డి' విజయంతో వాణీజయరాం ముఖ్య సంగీత దర్శకులకే కాకుండా మరాఠీ, గుజరాతి, మార్వాడి, భోజపురి భాషా చిత్రాలకు కూడా పాటలు పాడారు. రఫీ, మన్నాడే, మహేంద్ర కపూర్, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ల సరసన ఎన్నో యుగళ గీతాలకు ప్రాణం పోశారు. నౌషాద్, చిత్రగుప్త, మదన్‌ మోహన్, ఓ.పి.నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కళ్యాన్‌ జి ఆనంద్‌ జి, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి హేమాహేమీలైన సంగీత దర్శకుల చిత్రాలకు అనేక హిందీ పాటలు ఆలపించారు.

లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లే సరసన వాణీ జయరాం..
రేడియో సిలోన్‌లో బినాకా గీత్‌మాలా ఊపేస్తోంది. అమిన్‌ సయానీ మొదలెట్టిన ఈ షో.. ప్రతి వారం హిందీలో విడుదలైన జనరంజకమైన పాటల్ని ప్లే చేసి.. టాప్‌ లిస్ట్‌ను ఇస్తూ ఉంటుంది. మేల్‌ సింగర్స్‌లో అయితే దాదాపుగా రఫీ ఉంటారు. ఫిమేల్‌ సింగర్స్‌ అయితే లతా మంగేష్కర్‌ సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటారు. అలాంటి షోలో ఒకవారం అయినా తన పాట వినపడాలని ప్రతి గాయని, గీత కర్తా, సంగీత దర్శకుడు భావిస్తున్న సమయాన.. ఒక మద్రాసు అమ్మాయి హిందీలో ఒక పాట పాడింది. ఆ పాట ఆ అమ్మాయికి మొదటి పాట. అది బయటకు విడుదలైంది. లతా కాకుండా, ఆశా భోంస్లే కాకుండా.. హిందీలో మరొకరు, అందులో ఒక సౌత్‌ అమ్మాయి పాడటమా అని జనానికి వింత. అదీ బినాకాకు ఎక్కడం మరీ వింత. ఒక వారం కాదు రెండు వారాలు కాదు.. 16 వారాలు ఆ పాట చార్ట్‌ బస్టర్‌గా నిలవడం మరో వింత. ఆ వింతను సాధించిన కాంతే ఈ వాణీ జయరామ్‌.

లతా పాటకన్నా.. వాణీ పాటే బాగుంది..
ప్రముఖ దర్శక నిర్మాత వి.శాంతారాం నిర్మించిన 'ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే'(1955)లో హీరోయిన్‌ సంధ్యకి 'జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే' అనే మీరా భజన్‌ని సంగీత దర్శకుడు వసంత దేశాయి లతా మంగేష్కర్‌ చేత పాడించారు. ఈ పాటకి పద్మవిభూషణ్‌ శివకుమార్‌ శర్మ సంతూర్‌ వాద్యం వినిపించారు. హిందీ పాటల్లో సంతూర్‌ పరికరాన్ని వాడటం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ పాట బహుజనాదరణ పొందింది. 1979లో గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన 'మీరా' సినిమాలో పాటలన్నీ సంగీత దర్శకుడు పండిట్‌ రవిశంకర్‌ వాణీజయరాంతో పాడించారు.

ముఖ్యంగా 'జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే' భజన్‌ ఆమె గళంలో అద్భుతంగా అమరింది. పైగా సంతూర్‌ వాయిద్యానికి బదులు రవిశంకర్‌ సితార్‌ వాయిద్యాన్ని స్వయంగా వాయించటంతో పూవుకు తావి అబ్బినట్లయింది. ఈ పాటకు వాణీజయరాం 'ఫిలిం వరల్డ్‌ సినీ హెరాల్డ్‌' బహుమతి అందుకుంది. అందరూ లతా పాటని, వాణీజయరాం పాటని పోల్చి చూసి, వాణి పాడిన పాటే బాగుందని తేల్చారు. ఇదే పాటని యష్‌ చోప్రా నిర్మించిన 'సిల్‌ సిలా'(1981) చిత్రంలో సంగీత దర్శకులు శివ్‌-హరి మళ్లీ లతా చేత పాడించారు. అక్కడ కూడా లతా పాటకన్నా వాణీజయరాం ఆలపించిన భజనే గొప్పగా వుందని తేలింది.

'మీరా ఆఫ్‌ మోడ్రన్‌ ఇండియా'...
'మీరా' చిత్రం విడుదలైన తరువాత నుంచి వాణీజయరాంను 'మీరా ఆఫ్‌ మోడ్రన్‌ ఇండియా'గా అభివర్ణించడం మొదలైంది. ఈ పాటకు వాణీజయరాం ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్‌ బహుమతి కూడా అందుకుంది. లతాజీకి వాణీజయరాం మీద అసూయ పెరిగేందుకు ఇవన్నీ కారణాలయ్యాయి. ఈ రాజకీయాన్ని భరించలేని వాణీజయరాం హిందీ చిత్రసీమకు దూరంగా జరిగారు. అయితే ఎం.ఎస్‌. విశ్వనాథన్, మహదేవన్, రాజన్‌-నాగేంద్ర, విజయ భాస్కర్, చక్రవర్తి, సత్యం, శంకర్‌-గణేష్, చంద్రబోస్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణీజయరాం ప్రతిభను చక్కగా వినియోగించుకొని, ఆమె గళం ద్వారా తమ పాటలకి వన్నె తెచ్చారు.

గాన కోకిల అవార్డుల పర్వం..
ఎంతో సౌమ్యశీలి అయిన వాణీకి తమిళంలో ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ స్వరం కూర్చిన 'అపూర్వ రాగంగళ్‌' (తెలుగులో తూర్పు-పడమర) చిత్రంలో 'ఏళు స్వరంగళుక్కుళ్‌' పాటకు 1976లో జాతీయ స్థాయిలో ఆమె ఉత్తమ గాయని ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తరువాత ఆ అదృష్టం తెలుగు చిత్రాలకే దక్కింది. 'శంకరాభరణం' (1980)లో ఆలపించిన 'బ్రోచేవారెవరురా', 'మానస సంచరరే', 'దొరకునా ఇటువంటి సేవ' అనే మూడు పాటలకు సంయుక్తంగా; 'స్వాతికిరణం'(1991) చిత్రంలో 'ఆనతినీయరా హరా' అనే పాటకు వాణీజయరాంకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డులు దక్కాయి. ఇవి కాక గుజరాత్‌ (ఘూంఘట్‌), తమిళనాడు (అళఘే ఉన్నై ఆరాధిక్కిరేన్‌), ఆంధ్రప్రదేశ్‌ (శంకరాభరణం), ఒడిషా (దేబ్జని) రాష్ట్రాల పురస్కారాలు కోకొల్లలుగా అందాయి. '2015లో ఆమె ఫిలింఫేర్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని, పి.బి. శ్రీనివాస్‌ అవార్డుని అందుకున్నారు.

1992లో 'సంగీతపీఠ' సన్మానాన్ని అందుకున్న అతి పిన్నవయస్కురాలు వాణీజయరాం కావడం విశేషం. తమిళనాడు ప్రభుత్వం వాణీజయరాంకు 'కలైమామణి' పురస్కారాన్ని, త్యాగరాజర్‌ భాగవతార్‌ పేరిట ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని, సుబ్రమణ్య భారతి అవార్డును, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అవార్డులను ప్రదానం చేసింది. చెన్నైలోని ముద్ర అకాడమీ వారు దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ సంగీతాన్ని అందించినందుకు వాణీజయరాంకు 'ముద్ర అవార్డు' బహూకరించారు. ఇంకా ఎన్నెన్నో బహుమతులు వాణీజయరాంకు దక్కాయి. ఘంటసాల జాతీయ బహుమతి, దక్షిణ భారత మీరా బహుమతి వాణీజయరాం అందుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.