సినిమాల నిర్మాణంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగలడం అనేది సహజమని, మళ్లీ పుంజుకుని చిత్రాలు తీస్తుంటామని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. ఆయన ఓ సినిమా విషయంలో జరిగిన నష్టం చూసిన తర్వాత ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామని అని అనుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
"ఏదైనా సినిమాలో నేను దెబ్బ తిన్నప్పుడు చిరంజీవి పిలిచి 'కథ సిద్ధం చేసుకోండి. మనం సినిమా చేద్దాం' అని అనేవారు. నాగార్జున కూడా అంతే. వేరే వాళ్ల సినిమా ఆపేసి మరి నాకోసం సినిమాలు చేసిన హీరోలు ఎందరో ఉన్నారు. అయితే నా కెరీర్‌లో బాగా నిరాశకు గురి చేసిన సినిమా 'శక్తి'. 'ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం' అని అనిపించింది. నిర్మాణ వ్యయం కూడా బాగా ఎక్కువైంది. ఆ ఒక్క సినిమాలోనే రూ.32 కోట్లు పోయాయి. ఇది మామూలు విషయం కాదు. నేనూ అరవింద్ కలిసి 'చూడాలని ఉంది' సినిమాను హిందీలో నిర్మించాం. ఆ సినిమా వల్ల మా ఇద్దరికీ కలిపి సుమారు రూ.12కోట్ల మేర నష్టం వచ్చింది. అంటే చెరో రూ.6కోట్లు అనమాట. అయితే అప్పటికి మేం ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ కోలుకోగలిగాము. కానీ 'శక్తి' మాత్రం నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని నాకు అనిపించలేదు. సరిగ్గా అదే సమయానికి పిల్లలు వచ్చి సినిమా తీస్తామంటే ఒప్పుకొన్నా. మంచి సినిమాలు తీయడంతో వాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చాను" అని అశ్వినీదత్ అన్నారు.
శక్తి సినిమా విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించిన ఆ సినిమా 2011లో థియేటర్లలో విడుదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. సుమారు రూ.50 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 700పైగా స్క్రీన్‌లపై రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.
అశ్వినీదత్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా 'ప్రాజెక్ట్-కె' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.