సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఆ తర్వాత హీరోగాను ప్రేక్షకుల్ని అలరించాడు. జకన్న తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకుడిగా మెరిశారు. అయితే హీరోగా అంతగా ఆకట్టుకోలేకోపయినా ఆయన ప్రస్తుతం ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తూ కెరీర్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే సునీల్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ మూవీ అవకాశాల కోసం దర్శక-నిర్మాతల చుట్టూ తిరిగేవారు. అందుకే త్రివిక్రమ్ మాటలు రాసిన పలు సినిమాల్లో సునీల్ మంచి పాత్రల్లో నటించారు. అయితే, సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సునీల్.. త్రివిక్రమ్‌కు చాలా కండీషన్లు పెట్టేవారట. ఈ విషయాన్ని సునీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
"కథల విషయంలో త్రివిక్రమ్‌కు నేను చాలా కండీషన్లు పెట్టేవాడిని. రోజూ కథలు చెప్పమని అడిగేవాడిని. అయితే ఓ సారి.. వారం రోజుల్లో ఎవరికో కథ చెప్పడానికి వెళ్లాలి. టైం దగ్గర పడుతున్నా కూడా చాలా ప్రశాంతంగా కూర్చునేవాడు. ఇక టీవీలో వచ్చే క్రికెట్, పాత సినిమాలు చూస్తూ అలానే కాలం గడిపేసేవాడు. అలా దాదాపు వారం గడిపేశాడు. ఇక రేపు ఉదయాన్నే వాళ్లకు కథ చెప్పడానికి వెళ్లి తీరాలి. ఇంతలో నేను వచ్చి 'కథ ఓకే అయిందా' అని అడిగితే 'ఇంకా ఏమీ రెడీ కాలేదు ' అని సమాధానమిచ్చాడు. ఇక నేను వెంటనే టీవీ ఆపేసి, 'ముందు నాకు కథ చెబుతావా? లేదా?' అని పట్టుబట్టా. అంతే ఇక రాత్రి కూర్చొని నాలుగైదు గంటల్లో కథ చెప్పేసేవాడు. అలా చెప్పుకొంటూ పోతుంటే మొత్తం కథంతా ఇట్టే డెవలప్ అయిపోయేది. ఆయన నిజంగా సరస్వతి పుత్రుడు. నా లైఫ్‌లో తనతో నేను చేసిన ప్రయాణం ఎంతో మధురమైనది" అని చెప్పుకొచ్చారు.
"మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెప్పుకొస్తుంటారు. ఆ తర్వాత గురువులు కూడా అదే విషయాలను చెప్తూ విజ్ఞానాన్ని కూడా నేర్పుతారు. ఇక మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇంట్లో ఉన్న అన్నయ్య లేదా పెద్దవాళ్లు డబ్బులు ఇచ్చి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. అయితే నేను హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నా విషయంలో ఆ మూడు పాత్రలు పోషించిన వ్యక్తి ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. అందుకే నేను ఎన్ని పాత్రల్లో నటించినా.. చివరికి నా కోసం ఓ మంచి పాత్ర రాయడానికి తను ఉన్నాడని ధైర్యం నాకు ఎప్పుడు ఉంటుంది" అంటూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు హీరో సునీల్. 'పుష్ప' సినిమాలో మంగళం శ్రీనుగా మెప్పించిన సునీల్, ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'జైలర్'లో ఓ నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు టాక్.