ETV Bharat / entertainment

Tollywood 2022: క్రేజ్​ పెరిగింది.. రేటు మారింది.. కానీ ఆఖరిలో మాత్రం..

మరో రోజులో 2022 ముగియనుంది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చిత్రసీమకి కొన్ని విజయాలు దక్కాయి... పరాజయాలూ పలకరించాయి. అలానే దశాబ్దాల పాటు వెండితెరపై కాంతులీనిన పలువురు సినీ దిగ్గజాలు, చిత్ర ప్రముఖులు ఈ ఏడాదే కాలం చేశారు. ఇంకా సినీ ఇండస్ట్రీలో ఏం జరిగాయంటే..

Tollywood 2022 Roundup
Tollywood 2022: క్రేజ్​ పెరిగింది.. రేటు మారింది.. కానీ ఆఖరిలో మాత్రం..
author img

By

Published : Dec 30, 2022, 6:44 AM IST

తెలుగునాట కొత్త ఏడాది సినిమా సందళ్ల మధ్యే షురూ అవుతుంది. పెద్ద పండగ సంక్రాంతి జనవరి ప్రథమార్ధంలోనే కాబట్టి... అప్పటికే మొదలైన పండగ సినిమాల ప్రచార జోరు మధ్యే నవ వసంతాన్ని ఆరంభిస్తాం. విడుదలకి సిద్ధమవుతున్న కొత్త సినిమాల పాటలు కూడా ఆ సంబరాల్లో భాగం అవుతుంటాయి. కొత్త ఏడాదికీ... మన సినిమాకీ మధ్య అంతటి కనెక్షన్‌. ఊరిస్తున్న భారీ సినిమాలు... ఆకాశాన్ని తాకే అంచనాల మధ్యే సినీ ప్రియుడు 2022లోకి అడుగుపెట్టాడు. కాలం గిర్రున తిరిగిపోయింది. ప్రతి నెలా పదుల సంఖ్యలో విడుదలవుతున్న సినిమాలు... అవి పంచే వినోదం మధ్య తడిసి ముద్దయ్యాడు ప్రేక్షకుడు. కొన్ని సినిమాలు నిరాశనీ మిగిల్చాయి. పరిశ్రమకి కొన్ని విజయాలు దక్కాయి... పరాజయాలూ పలకరించాయి. చిత్రసీమకి ఇవన్నీ మామూలే. ఆ ఫలితాల మాటెలా ఉన్నా... మళ్లీ అవే అంచనాలు, ఆశల మధ్య మరో వసంతంలోకి అడుగుపెట్టే దశ ఇది. మరి గతేడాది ఎలా గడిచిందో ఓసారి అవలోకనం చేసుకుంటే...

.

ఈసారి వెండితెర మరింత పెద్దదైంది. కారణం భారీ హంగులతో కూడిన సినిమాలే. మన సినిమా స్థాయి ఇదీ అని మరోమారు అవి చాటి చెప్పాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ మొదలుకొని... ఈమధ్య విడుదలైన హారర్‌ చిత్రం మసూద వరకు పలు రకాల చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాల్ని అందుకున్నాయి. ఈఏడాది 220కిపైగా తెలుగులో తీసిన చిత్రాలు... 65కిపైగా అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముంగిటకొచ్చాయి. వాటిలో 30 సినిమాలకిపైగా విజయాల్ని సొంతం చేసుకున్నాయనేది ట్రేడ్‌ వర్గాల లెక్క.

పాన్‌ ఇండియా... పాన్‌ ఇండియా... ఈ ఏడాది మరీ ఎక్కువగా వినిపించిన మాట ఇది. పలు తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో బాక్సాఫీస్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందడమే అందుకు కారణం. కానీ ఆ ప్రయత్నం కొంతమేరకే సఫలమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మేజర్‌’ మినహా మిగతా చిత్రాలు అంచనాల్ని అందుకోలేకపోయాయి. ‘కార్తికేయ2’ మాత్రం అనూహ్యంగా పాన్‌ ఇండియా స్థాయిలో జెండా ఎగరేసింది. ‘సీతారామం’ ఫర్వాలేదనిపించింది. భారీ ప్రచారం, అంచనాల మధ్య విడుదలైన ‘రాధేశ్యామ్‌’, ‘లైగర్‌’, ‘ఆచార్య’ ప్రభావం చూపించలేకపోయాయి. అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకోగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల్ని అందుకొంటోంది. ‘నాటు నాటు’ పాటకి ఉత్తమ ఒరిజినల్‌ పాటగా ఆస్కార్‌ బరిలో షార్ట్‌లిస్ట్‌కి ఎంపికైంది. ప్రతిష్ఠాత్మకమైన రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ నామినేషన్లని కూడా సొంతం చేసుకుంది. ఇంకా పలు అంతర్జాతీయ పురస్కారాల్లో సినిమా పేరు మార్మోగుతోంది. ‘రాధేశ్యామ్‌’ పరాజయాన్ని చవిచూసినా, అందులో సాంకేతిక హంగులు ఆకట్టుకున్నాయి.

పుష్ప... అఖండ సినిమాలు ఇచ్చిన విజయోత్సాహం మధ్య తెలుగు సినిమా 2022 క్యాలెండర్‌ మొదలైనప్పటికీ... జనవరిలోనే ఒమిక్రాన్‌ భయాలు మొదలైపోయాయి. దాంతో బాక్సాఫీసు సంక్రాంతి కళ కోల్పోయింది. ‘బంగార్రాజు’ మినహా అగ్ర తారల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. ఫిబ్రవరిలో విడుదలైన ‘డి.జె.టిల్లు’తో బాక్సాఫీస్‌ దగ్గర సందడి మొదలైంది. అదే నెలలో విడుదలైన పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’తో థియేటర్ల దగ్గర సందడి పెరిగింది. టికెట్‌ ధరల సమస్య కారణంగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది కానీ... థియేటర్లకి ప్రేక్షకులు పోటెత్తడం మొదలైంది ఆ సినిమా నుంచే.

.

బడా చిత్రాల జోరు... థియేటర్ల దగ్గర అగ్ర తారలు నటించిన సినిమాల తాకిడి కనిపించింది మార్చి నుంచే. ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైంది ఈ నెలలోనే. ‘రాధేశ్యామ్‌’ నిరాశపరిచినా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బాక్సాఫీసు వసూళ్లతో కళకళలాడింది. కీలకమైన వేసవి పేలవంగా సాగుతున్నట్టు అనిపించింది. ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్‌3’ చిత్రాలతో మే ఊరించింది. భారీ తారాగణం, భారీ వ్యయంతో రూపొందిన ఆ చిత్రాలు ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఆ నెలలో విడుదలైన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ విమర్శకుల్ని మెప్పించింది. ‘మేజర్‌’, ‘అంటే సుందరానికి’, ‘విరాటపర్వం’ తదితర చిత్రాలు జూన్‌లో విడుదలయ్యాయి. వీటిలో ‘మేజర్‌’, ‘విరాటపర్వం’ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ‘పక్కా కమర్షియల్‌’తో మొదలైన జులై నెల ‘థ్యాంక్యూ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రాల్ని ఆశల్ని పెంచింది. కానీ ఫలితం మాత్రం దేనికీ రాలేదు. ఆగస్టులో ఒకే రోజు విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలతో మళ్లీ చిత్రసీమ ట్రాక్‌లోకి వచ్చింది. ఇదే నెలలోనే వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’, ‘లైగర్‌’ సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నా, ‘కార్తికేయ2’ మాత్రం సత్తా చాటింది. సెప్టెంబరులో ‘ఒకే ఒక జీవితం’తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు శర్వానంద్‌. నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో పర్వాలేదనిపించారు.

ఆఖరి మూడు నెలలూ.. 2022 ఆఖరి మూడు నెలలు విడుదలలు మరింత పెరిగాయి. ఒకొక్క వారం అరడజనుపైగా సినిమాలు విడుదలైన సందర్భాలున్నాయి. 2023 సంక్రాంతి మొదలుకొని, ఆ తర్వాత కూడా అగ్రతారల సినిమాలే వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. దాంతో పలు చిన్న చిత్రాలు ఈ ఏడాది చివర్లో విడుదల కోసం పోటీపడ్డాయి. అక్టోబరులో విడుదలైన నాగార్జున ‘ది ఘోస్ట్‌’తో ప్రభావం చూపించలేదు కానీ, ‘గాడ్‌ఫాదర్‌’తో చిరంజీవి మెప్పించారు. బెల్లంకొండ గణేష్‌ తొలి చిత్రం ‘స్వాతిముత్యం’ విమర్శకుల్ని మెప్పించింది. ఈ నెలలో విడుదలైన అన్ని సినిమాలకి వసూళ్లు అంతంత మాత్రమే.

.

నవంబరులో విడుదలైన ‘యశోద’, ‘మసూద’ మంచి వసూళ్లతో విజయాల్ని సొంతం చేసుకున్నాయి. మరో చిన్న చిత్రం ‘గాలోడు’ పర్వాలేదనిపించింది. ‘ఊర్వశివో రాక్షసివో’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాలు పర్వాలేదనిపించినా, వసూళ్లలో ప్రభావం చూపించలేకపోయాయి. డిసెంబరులో ‘హిట్‌2’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు అడివి శేష్‌. రవితేజ ‘ధమాకా’ మంచి వసూళ్లని సాధించింది. ‘18 పేజెస్‌’ వైవిధ్యమైన ప్రేమకథగా నిలిచింది. ఈ ఏడాది చివరి శుక్రవారమైన 30వ తేదీ కూడా సినిమాలు పోటెత్తుతున్నాయి. కాకపోతే అన్నీ చిన్న చిత్రాలే. ఆదిసాయికుమార్‌ నటించిన ‘టాప్‌గేర్‌’ ప్రధానంగా కనిపిస్తోంది.

.

షూటింగ్స్​ బంద్‌.. ఆగస్టులో సినిమా చిత్రీకరణల బంద్‌కు పిలుపునిస్తూ.. తెలుగు యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీసుకున్న నిర్ణయం కూడా ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో తీవ్ర చర్చనీయాంశమైంది. చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యల్ని పరిష్కరించేందుకు తీసుకున్న ఈ బంద్‌ నిర్ణయంపై పరిశ్రమలోని సినీ పెద్దల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ బంద్‌ నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొందరు విమర్శించారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాలు, వీపీఎఫ్‌ ఛార్జీలు, అగ్రతారల పారితోషికాలు, ఓటీటీ విడుదలలు తదితర అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం ఇందులో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలుపుతూ.. సెప్టెంబరు 1నుంచి చిత్రీకరణలు యథావిథిగా కొనసాగించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి ప్రకటించడంతో బంద్‌ ముగిసింది. అయితే ‘ఈ బంద్‌ నిర్ణయంతో చిత్ర పరిశ్రమకు ఒరిగిందేం లేద’ని నిర్మాత సి.కల్యాణ్‌ ఇటీవల విమర్శించారు.

సాంగ్స్​ సూపర్​..

.

భారతీయ చిత్రాలకు పాటలే ప్రధాన ఆకర్షణ. అవే సగం బలం. పాటలు హిట్టయ్యాయంటే చాలు.. సినిమాకి ఊహించనంత ప్రచారం అవలీలగా వచ్చేస్తుంది. ప్రేక్షకులు థియేటర్లకు వరుస కట్టేస్తారు. అందుకే పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాయి చిత్ర బృందం. ఈ ఏడాది దాదాపు పదిహేనొందలకు పైగా గీతాలు సినీప్రియుల ముందుకొచ్చాయి. వాటిలో ఉర్రూతలూగించిన పాటలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది ప్రేక్షకుల్ని బాగా ఊపేసిన గీతాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘‘నాటు.. నాటు’’ ఒకటి. ఆ పాటలో ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి వేసిన ఊర మాస్‌ స్టెప్పులు, వాళ్లిద్దరి టైమింగ్‌ చూడటానికి రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు. హుషారెత్తించే పాటలకు చిరునామాగా నిలుస్తుంటాయి చిరంజీవి చిత్రాలు. ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన ‘ఆచార్య’లో అలాంటి గీతాలు గట్టిగానే వినిపించాయి. ఇందులో ‘లాహే లాహే’ పాటలో చిరంజీవి వేసిన స్టెప్పులకూ మంచి ఆదరణ దక్కింది. మహేష్‌బాబు - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘‘కళావతి’’, ‘‘మహేశా’’ గీతాలు కుర్రాళ్లకు గట్టిగా ఎక్కేశాయి. ‘డీజే టిల్లు’లోని టైటిల్‌ పాట, ‘విక్రాంత్‌ రోణ’లోని ‘‘రా రా రక్కమ్మ’’ గీతం ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ.. అటు థియేటర్లలోనూ మోత మోగించేశాయి. ‘సీతారామం’ చిత్ర విజయంలో సంగీతం ప్రధాన భూమిక పోషించింది. ఈ సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకుల మదిని సుతిమెత్తగా మీటాయి. ఇక ‘కాంతార’లో ‘‘వరాహరూపం’’ పాట చేసిన మ్యాజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా ఆఖర్లో వచ్చే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేసింది. ఇవే కాదు.. ‘ది వారియర్‌’లోని ‘‘విజిల్‌ విజిల్‌’’, ‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘‘రా రా రెడ్డీ’’, ‘భీమ్లానాయక్‌’లోని టైటిల్‌ పాట.. ఇవన్నీ సినీప్రియుల మెప్పు పొంది, శభాష్‌ అనిపించుకున్నవే.

టికెట్​ రెట్స్​ కాంట్రవర్సీ.. సినిమా టికెట్‌ ధరల వివాదం ఈ ఏడాది చిత్ర పరిశ్రమను కుదిపేసింది. టికెట్‌ ధరల్ని దారుణంగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పెద్ద దుమారాన్నే సృష్టించింది. ‘థియేటర్‌ కౌంటర్‌ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కౌంటర్‌ కలెక్షన్‌ ఎక్కువ’ అంటూ నాని ఈ ధరల వివాదంపై నోరు విప్పాక.. అనేక మంది సినీ ప్రముఖులు మీడియా ముందుకొచ్చి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. వారిపై ఏపీ ప్రభుత్వ నాయకులు ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సామాజిక మాధ్యమాల వేదికగా ఏపీ ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ఫిబ్రవరిలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ లాంటి అగ్రతారలు ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని కలవడం.. ఆ సమయంలో పరిశ్రమను ఆదుకోవాలంటూ చిరంజీవి చేతులు జోడించి ప్రార్థించడం లాంటివీ తీవ్రమైన చర్చకే దారితీశాయి. ఇక టికెట్‌ ధరల్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం మార్చి తొలి వారంలో జీవో విడుదల చేశాక.. ఈ వివాదం సద్దుమణిగింది.

డబ్బింగ్​ హవా.. కొన్నేళ్లుగా అనువాద చిత్రాలపై మన సినిమాలదే ఆధిపత్యం కొనసాగతూ వస్తోంది. అయితే ఈ ఏడాది పొరుగు భాషల నుంచి వచ్చిన పలు సినిమాలు ఆకట్టుకున్నాయి. కన్నడ నుంచి వచ్చిన ‘కె.జి.ఎఫ్‌2’కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే భాష నుంచి వచ్చిన రిషబ్‌శెట్టి ‘కాంతార’, సుదీప్‌ ‘విక్రాంత్‌రోణ’ వసూళ్లతో హోరెత్తించాయి. కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’, కార్తి ‘సర్దార్‌’, మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తోపాటు పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘లవ్‌ టుడే’ కూడా ఆకట్టుకుంది. హిందీ నుంచి వచ్చిన బ్రహ్మాస్త్ర, ది కశ్మీర్‌ఫైల్స్‌ కూడా మెప్పించాయి. ఇక ‘అవతార్‌ 2’ అయితే థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది.

దిగ్గజాలు వెళ్లిపోయారు..

.

తెలుగు చిత్రసీమకు 2022 ఓ విషాద సంవత్సరంగా గుర్తుండిపోతుంది. దశాబ్దాల పాటు వెండితెరపై కాంతులీనిన పలువురు సినీ దిగ్గజాలు, చిత్ర ప్రముఖులు ఈ ఏడాదే కాలం చేశారు. సినీప్రియుల్ని శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సీనియర్‌ కథానాయకులు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సెప్టెంబరు 11న, సూపర్‌స్టార్‌ కృష్ణ నవంబరు 15న కన్నుమూయడంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ తరం సినీ శకం ముగిసినట్లైంది. కృష్ణ తనయుడు, మహేష్‌బాబు సోదరుడు, నటుడు రమేష్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధితో జనవరి 8న తుది శ్వాస విడవగా.. ఇదే నెల 3న సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూశారు. భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్‌ ఫిబ్రవరి 6న దివికేగగా.. డిస్కో పాటలతో సినీప్రియుల్ని ఉర్రూతలూగించిన బప్పీ లహరి ఫిబ్రవరి 15న మరణించారు. సినీ గేయ రచయిత కందికొండ, సంగీత దర్శకుడు ఈశ్వర్‌రావు మార్చి 12న కన్నుమూశారు. దర్శకుడు పోలవరపు శరత్‌ ఏప్రిల్‌ 1న, నటుడు మన్నవ బాలయ్య ఏప్రిల్‌ 9న, దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్‌ 20న, నిర్మాత నారాయణదాస్‌ కె.నారంగ్‌ ఏప్రిల్‌ 19న అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. ఇక రచయిత, దర్శకుడు మదన్‌ నవంబరు 19న మరణించగా.. నటుడు కైకాల సత్యనారాయణ డిసెంబరు 23న, చలపతిరావు డిసెంబరు 24న కన్నుమూశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.