ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతి, దసరాకు స్ట్రయిట్ తెలుగు సినిమాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు 2017లో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకుందని తెలిపింది.
స్ట్రయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఎలా ఇస్తామంటూ గతంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా చలన చిత్ర నిర్మాతల మండలి గుర్తు చేసింది. ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు పాటించాలని కోరింది. ఈ క్రమంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడుకోడానికి ఎగ్జిబిటర్లంతా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది.
అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదలకు ముస్తాబవుతుండగా.... అనూహ్యంగా దిల్ రాజు తమిళ హీరో విజయ్ తో నిర్మించిన ద్విభాషా చిత్రం వారసుడు, అలాగే అజిత్ కుమార్ నటించిన తునీవ్ చిత్రాలను సంక్రాంతికే విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాటిని రెండో ప్రాధాన్యతగా ప్రదర్శించాలని సూచిస్తూ నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు లేఖలు రాసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవీ చదవండి : పట్నం వైద్యాన్ని పల్లెకు తెచ్చిన దీపికా పదుకొణె ట్రిపుల్ ఎల్‌తో వెలుగులు