Bollywood Movies: 'హిందీ సినిమాలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వెనుకబడిన మాట నిజమే. కానీ, సెకండాఫ్‌లో పరిస్థితి చక్కబడుతుంది. పెద్ద హీరోలైన ఆమిర్ ఖాన్, అక్షయ్ సినిమాలు బాలీవుడ్‌కి పూర్వవైభవం తెస్తాయి' కొద్దిరోజుల క్రితం ఒక బాలీవుడ్ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలివి. ప్రేక్షకులు కూడా 'లాల్ సింగ్ చడ్డా', 'రక్షా బంధన్'లకు ఆ సత్తా ఉందని నమ్మారు. గతవారం రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. కానీ, ఫలితం.. 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్లు ఉంది. కంటెంట్ అంత బలంగా లేదు. ఆమిర్‌ఖాన్ నటనలో కొత్తదనం లేదు. అక్షయ్ సినిమాలో విషయం లేదు. థియేటర్లకి ప్రేక్షకులు రావట్లేదు. ముందు పరాజయం పాలైన సినిమాల విషయంలోను లోపం ఇదే కదా.
నిజమే కానీ..ఇవి పెద్ద సినిమాలు మరి.. బాలీవుడ్ బడా స్టార్లు నటించిన చిత్రాలు. 'లాల్ సింగ్ చడ్డా' దాదాపు రూ.180కోట్ల బడ్జెట్‌తో తీస్తే, రక్షా బంధన్ బడ్జెట్ రూ.70కోట్లు. రెండు సినిమాల ఓపెనింగ్స్ పరిశీలిస్తే లాల్ సింగ్ చడ్డా మొదటి రోజు రూ.12 కోట్లు వసూలు చేస్తే, రక్షా బంధన్ 8కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజుకే ఈ వసూళ్లు సగానికి పడిపోయాయి. లోపం ఎక్కడో తెలియక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి తోచిన కారణాన్ని వాళ్లు చెబుతున్నారు.
అసలు కారణం ఏంటి?
బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ చిత్రాలకో ప్రత్యేకత ఉంది. ఆయన సినిమాల్లో కంటెంట్ బలంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఆమిర్ నటించిన గత ఐదు చిత్రాలను పరిశీలిస్తే 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' మినహా అన్నీ విషయం ఉన్న సినిమాలే. స్వదేశంలో అంతగా ఆడని 'సీక్రెట్ సూపర్‌స్టార్' సైతం కథ బాగుండడంతో ఓవర్సీస్(ప్రత్యేకంగా చైనా)లో మంచి కలెక్షన్లను సాధించింది. అయితే రానురాను అదే తరహా కథలను ఎంపిక చేసుకుని ఆమిర్ బోర్ కొట్టిస్తున్నాడని హిందీ ప్రేక్షకులు ఆ మధ్య గుసగుసలాడుకున్నారు.
తాజాగా 'లాల్ సింగ్ చడ్డా' డీలా పడడంతో విషయం నిజమేనని అర్థమవుతోంది. హావభావాల్లో కొత్తదనం లేదు, సన్నివేశాలు రక్తి కట్టించలేదు, కథనం చప్పగా సాగింది. ఇవి 'లాల్ సింగ్ చడ్డా'పై తొలిరోజే ప్రేక్షకులు మోపిన అభియోగాలు. మొదటి రోజు థియేటర్లకి 25శాతం ప్రేక్షకులే హాజరయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సినిమాకు నిరసనల సెగ తగిలినా, సినిమాపరంగా కూడా ఆకట్టుకోలేకపోవడంతో రెండు రోజే ప్రేక్షకులు పలచబడ్డారు. నిజంగా సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు హాజరవుతారని కొద్ది నెలల క్రితమే విడుదలైన 'గంగూభాయి కాఠియావాడి', 'భూల్ భులయ్యా-2' నిరూపించాయి. మరి ఆ స్థాయి విజయం సాధించడంలో లాల్ సింగ్ వెనకబడిందనే చెప్పాలి.
ఇక ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కి ఈ సంవత్సరం చేదు అనుభవాన్నే మిగిల్చింది. గతేడాది విడుదలైన 'సూర్యవన్షీ' చిత్రం తర్వాత విడుదలైన సినిమాలన్నీ భారీ నష్టాలనే మిగిల్చాయి. 'బచ్చన్ పాండే', 'సమ్రాట్ పృథ్వీరాజ్' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా 'రక్షాబంధన్' కూడా అదే పంథాలో వెళ్తోందని ఆ సినిమా కలెక్షన్లు చెబుతున్నాయి. మొదటిరోజు దాదాపు రూ.8కోట్లే వసూలు చేసిన ఈ సినిమా రెండోరోజుకి రూ.6 కోట్లకి పడిపోయిందని, అక్షయ్ గత రెండు చిత్రాలు మొదటిరోజు సాధించిన కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయిందని బాక్సాఫీస్ గణాంకాలు చెబుతున్నాయి.
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడం, బిగ్‌స్టార్‌ల సినిమాల విడుదలకు సిద్ధమవడం చూసి, బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుందని ఆశించారు. 'లాల్' ఏకంగా 3500 తెరలపై విడుదల చేయగా, 'రక్షాబంధన్'ను 2500 స్క్రీన్‌లపై విడుదల చేశారు. నిరసన సెగలు, 'లాల్' చిత్రంలో దమ్ములేకపోవడంతో మరుసటి రోజే 1000కు పైగా స్క్రీన్‌లను తెగ్గొసేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజా పరిస్థితి చూసి, డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు.
సినిమా బాగోలేదని టాక్ వస్తే, ప్రేక్షకుడు థియేటర్‌వైపు చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా పట్టించుకోవటం లేదు. ముంబయిలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లైన గైటీ, జెమిని, మరాఠ మందిర్‌లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. 'థియేటర్‌లలో సాధారణ టికెట్ రూ.130, బాల్కనీ రూ.160కు తగ్గించాం. అయినా కూడా ప్రేక్షకులు రావటం లేదు. 'లాల్ సింగ్ చడ్డా' నిడివి ఎక్కువ. కథాగమనం చాలా నెమ్మదిగా ఉంది. ఇక 'రక్షాబంధన్’ ఆ టైటిల్‌ను జస్టిఫై చేయలేకపోయింది' అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
హిందీ చిత్రాల కంటెంట్ అనుకున్న స్థాయిలో ఉండటం లేదని ఐనాక్స్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సింగ్ జైలా అన్నారు. సక్సస్ సాధించిన 'భూల్ భూలయ్య2', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్', 'గంగూబాయి కాఠియావాడి'చిత్రాలు మాత్రం మంచి కంటెంట్ ఉండటం ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు, ఓటీటీల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో సినిమా ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా, 'ఓటీటీలో చూద్దాంలే' అని ప్రేక్షకుడు భావిస్తున్నట్లు చెప్పారు. మరి రాబోయే రోజుల్లోనైనా హిందీ చిత్ర పరిశ్రమకు ఊపిరిలూదే సినిమాలు వస్తాయో లేదో చూడాలి.
ఇవీ చదవండి: లైగర్ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ