ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా SSMB 28. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌కు కొన్ని అడ్డంకులు తప్పేలా లేవు. ఇందుకు కారణం హీరో మహేశ్, త్రివిక్రమ్‌ల మధ్య సఖ్యత లోపించిందనే కారణం మాత్రం ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారమైతే జరుగుతోంది. కానీ ఈ గాసిప్స్‌ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొట్టిపారేశారు. అటువంటిది ఏమిలేదని డైరెక్టర్, హీరోల మధ్య బాండింగ్ బాగానే ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా మహేశ్ ఫారిన్ టూర్‌కు వెళ్లడం వల్ల ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, మహేశ్ తాజా ట్రిప్‌తో వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయిందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.
కొద్దిరోజుల క్రితమే పారిస్‌కు..
త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్లో మహేశ్ జనవరి నుంచి మార్చి నెలల్లో ఇప్పటికే పాల్గొన్నారు. ఆ తర్యాత కొంత బ్రేక్ తీసుకున్న మహేశ్.. భార్య నమ్రత పిల్లలతో కలిసి పారిస్‌కు వెళ్లారు. కొద్ది రోజులకు తిరిగి ఇండియా వచ్చారు. ఏమైందో కానీ నెల కూడా గడవకముందే ఈరోజు (ఏప్రిల్ 28న) మళ్లీ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లారు మహేశ్ బాబు. ఈ పరిణామాలన్నింటికి కారణం మహేశ్ , త్రివిక్రమ్ మధ్య చిన్న గొడవలు జరుగుతున్నాయని ఫిల్మీ మీడియా పేర్కొంది. దర్శకుడి పనితీరు పట్ల హీరో అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు హైలైట్ అవుతున్నాయి.
హీరోయిన్గా పూజా హెగ్డే వద్దు..?: మహేశ్
సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు హీరోయిన్గా పూజా హెగ్డేను వద్దన్నారట మహేశ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ను కూడా పక్కనపెట్టమన్నారని ప్రచారం జరిగింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఎలాగో మహేశ్‌ను కన్వీన్స్ చేసి ఒప్పించారట. మరోవైపు కథ మార్చమని కోరితే స్క్రిప్ట్ ఛేంజ్ చేశారని.. అప్పటికే తీసిన యాక్షన్ సీన్స్ బాగా రాలేదని.. దీంతో ఏకంగా ఫైట్ మాస్టర్లనే మార్చారట త్రివిక్రమ్. మరి ఇప్పుడు మహేశ్, మరో కథానాయిక శ్రీలీల మధ్య తీసిన సీన్స్ సరిగ్గా పండలేదని.. వీటిని పక్కనపెట్టి కొత్తగా మళ్లీ రీషూట్ చేద్దామని త్రివిక్రమ్ మహేశ్‌తో అన్నారట. ఇందుకు మహేశ్ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారని ఇండస్ట్రీలోని మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ ఫారిన్ టూర్ వేయడం ఫ్యాన్స్‌కు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లేనని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు.
''ఆహారం కోసం అన్వేషించేటప్పుడు పక్షులు గట్టిగా అరుస్తాయి. ఎవరైనా అటెన్షన్ కోసం ప్రయత్నించేటప్పుడు ఇదే విధంగా రూమర్స్‌ను వ్యాపిస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదా పట్టించుకుండా వదిలేయడం చేయాలి. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. SSMB 28 సినిమా ప్రతిఒక్కరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీస్తున్నాం. మీరు వినాలనుకునేది మాత్రమే వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ మాత్రం గుర్తు పెట్టుకోండి''- నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీట్
దర్శకుడు త్రివిక్రమ్, హీరోగా మహేశ్ బాబు, హీరోన్లుగా శ్రీలీల, పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.