దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'సీతారామం'. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మృణాల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..
నేను తెలుగు పరిశ్రమకి కొత్తైనా.. ఇక్కడి ప్రేక్షకులకు కాదు. నేను నటించిన 'కుంకుమ భాగ్య' ధారావాహిక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్ అయ్యింది. 'సీతారామం' లాంటి ఓ గొప్ప సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడతానని ఎప్పుడూ అనుకోలేదు. తొలి అడుగులోనే వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలో చేయడం.. దుల్కర్ సల్మాన్, సుమంత్, రష్మిక, గౌతమ్ మేనన్ వంటి ప్రతిభావంతులు, అనుభవజ్ఞులతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం.
హిందీ 'జెర్సీ' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు హను రాఘవపూడి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి నాకు హను గురించి తెలుసు. ఆయన సినిమాలు చూశా. అందమైన కాన్వాసులా కనులవిందుగా ఉంటాయి. అందుకే ఆయన ఫోన్ వచ్చిందనగానే ఎగ్జైట్‌గా ఫీలయ్యా. సీతామహాలక్ష్మి పాత్ర గురించి చెప్పగానే ఆ పాత్రతో ప్రేమలో పడిపోయా. ఎందుకంటే ఆ పాత్రలో చాలా కోణాలున్నాయి. నటనకు ఆస్కారముంది. ప్రతి నటికీ సీత లాంటి పాత్ర చేయాలన్న కోరిక ఉంటుంది. కెరీర్‌లో చాలా అరుదుగా దొరికే పాత్ర ఇది.
అన్నీ ఉన్నాయి: దుల్కర్ సల్మాన్ ప్రతిసారీ 'ఇదే నా చివరి ప్రేమకథా చిత్రమ'ని చెబుతుంటారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే (నవ్వుతూ). ఈ చిత్ర విషయంలోనూ అలాగే చెప్పారు. ఏదేమైనా సరే ఆయనతో కలిసి నా తొలి తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదొక అందమైన ప్రేమకథా చిత్రం. ఇందులో వినోదం, దేశభక్తి, యుద్ధంతోపాటు ఎన్నో థ్రిల్లింగ్ అంశాలున్నాయి. సినిమాలో సీతకు లెఫ్టినెంట్ రామ్‌కు మధ్య ఉండే అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం కోసం మైనస్ 10 డిగ్రీల చలిలో షూట్ చేశాం. కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
గర్వంగా ఉంది..: 2014లో వచ్చిన 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో నేను వెండితెరపైకి అడుగుపెట్టా. మధ్యలో కొన్ని ధారావాహికల్లో నటించా. 2018లో తొలి హిందీ సినిమా 'లవ్ సోనియా' చేశా. ఆ చిత్రం విడుదలయ్యే సమయానికి నా చేతిలో మరో సినిమా ఏదీ లేదు. అయితే 'సీతారామం' చిత్రం అలా ప్రకటించారో.. లేదో అవకాశాలు వరస కట్టాయి. ఇప్పుడు చేతిలో అరడజను చిత్రాలున్నాయి. ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా ఉంది. సహాయ దర్శకురాలిగా కెరియర్ మొదలు పెట్టి.. నాయికగా ఇన్ని భాషల్లో నటించే అవకాశాలు అందుకుంటున్నా.
అలా చేస్తే బోర్..: నటిగా అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటా. అది గ్రే షేడ్ అయినా, పూర్తిగా ప్రతినాయిక ఛాయలున్నదైనా కావొచ్చు. ప్రేక్షకులకు నేను మృణాల్‌గా కాకుండా చేసిన పాత్రల పేర్లతోనే గుర్తుండాలనుకుంటా. ప్రతిసారీ విభిన్నమైన పాత్రలతో వాళ్లను సర్‌ప్రైజ్ చెయ్యాలనుకుంటా. ఎప్పుడు ఒకే తరహావి చేసుకుంటూ వెళ్తే మనకే బోర్ కొట్టేస్తుంది. ప్రస్తుతం హిందీలో 'పీపా' అనే చిత్రం చేస్తున్నా. ఇండియా - బంగ్లాదేశ్ మధ్య జరిగే యుద్ధ నేపథ్యంలో ఉంటుంది. ఆదిత్యరాయ్ కపూర్‌తో 'పూజా మేరీ జాన్' అనే సినిమా చేస్తున్నా. తెలుగులో ఓ కథ చర్చల దశలో ఉంది.
ఇదీ చదవండి: నాలోని నటుడ్ని గుర్తించింది ఆయనే: బాలకృష్ణ