నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్(కేకే)కు కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబయిలో కేకే ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన అంబులెన్స్‌లో కేకే పార్థీవదేహాన్ని శ్మశాన వాటిక వరకు తీసుకెళ్లారు. కేకే కుమారుడు నకుల్.. తన తండ్రికి అంతిమ కార్యాన్ని నిర్వహించాడు.
విశాల్ భరద్వాజ్‌తో పాటు అతడి భార్య రేఖ, నిర్మాత అశోక్ పండిట్, జావేద్ అక్తర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్, సలీం మర్చంట్, అల్కా యాగ్నిక్ అభిజిత్ భట్టాచార్య తదితర బాలీవుడ్ ప్రముఖులు కేకేను చివరిసారి చూసేందుకు తరలివచ్చారు. బంగాల్ ప్రభుత్వం బుధవారం కేకే గౌరవార్థం గన్ సెల్యూట్ చేసింది. సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు.
1996లో గుల్జార్ దర్శకత్వం వహించిన 'మాచిస్'తో అరంగేట్రం చేశారు కేకే. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. అనతి కాలంలో అత్యంత ప్రజాధారణ పొందిన గాయకుడిగా ఎదిగారు. అయితే కేకే సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. దిల్లీలోని ఒక ప్రదర్శనలో కేకే పాట విన్న హరిహరన్.. ముంబయికి తీసుకొచ్చి.. ప్రోత్సహించారు. నాటి నుంచి చనిపోయే నాటికి ఎన్నో పాటలు పాడారు. వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.
ఇదీ చదవండి: జానీ డెప్-అంబర్ హెర్డ్.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్!