Shah Rukh Khan: క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఇటీవల క్లీన్‌చిట్ లభించింది. అయితే, అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ క్రమంలో అతడు అధికారుల ముందు అనేక ఆత్మవిమర్శ తరహా ప్రశ్నలు లేవనెత్తినట్లు ఓ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నేతృత్వం వహించిన ఎన్సీబీ అధికారి సంజయ్ సింగ్‌తో చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ కథనం రాసింది. విచారణ సమయంలో ఆర్యన్ మానసిక ఆరోగ్యంపై షారుఖ్ తనను కలిసి ఆందోళన వ్యక్తం చేశారని ఆ అధికారి వెల్లడించినట్లు తెలిపింది.
ఆర్యన్ నుంచి ఆ తరహా ప్రశ్నలు ఊహించలేదని సంజయ్ సింగ్ తన ఇంటర్వ్యూలో చెప్పినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది. "విచారణ క్రమంలో ఆర్యన్‌కు సౌకర్యంగా అనిపించేలా.. నేను ఓపెన్ మైండ్‌తో వచ్చానని చెప్పా. దీంతో అతను 'సర్. మాదకద్రవ్యాల రవాణాకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు నన్ను అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికర్‌గా చిత్రించారు. ఈ ఆరోపణలు అసంబద్ధంగా లేవా?' అని ప్రశ్నించాడు. 'నౌకపై దాడి చేసిన రోజు అధికారులకు నా దగ్గర డ్రగ్స్ దొరకలేదు. అయినా.. అరెస్ట్ చేశారు. సర్.. మీరు నా విషయంలో పెద్ద తప్పు చేశారు. నా పరువు తీశారు. నేను ఇన్ని వారాలు జైల్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? నేను నిజంగా ఈ శిక్షకు అర్హుడినా?' అంటూ ప్రశ్నించాడు. అతని నుంచి ఈ తరహా ప్రశ్నలు ఊహించలేదు" అని ఆ అధికారి చెప్పినట్లు వెల్లడించింది.
"విచారణ సాగుతోన్న సమయంలో షారుఖ్ సైతం నన్ను కలిసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో మిగతా నిందితుల తల్లిదండ్రులను కలుస్తున్న నేపథ్యంలో.. షారుఖ్‌నూ కలిశా. ఆయన.. తన కుమారుడి మానసిక ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఆర్యన్ సరిగ్గా నిద్రపోవడం లేదని, రాత్రంతా అతనితో కలిసి ఉండాలని చెబుతున్నట్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ.. తన కుమారుడి పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారని అన్నారు. 'సమాజాన్ని నాశనం చేసేందుకు బయల్దేరిన ఒక రకమైన నేరస్థులుగా, రాక్షసులుగా మమ్మల్ని చిత్రించారు. బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది' అని కళ్లనిండా నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశాడు" అని సంజయ్ సింగ్ చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.
ముంబయి తీరంలోని ఓ క్రూజ్ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్ ఖాన్ ఉండటం గతేడాది ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. ఈ కేసులో ఎన్సీబీ అతడికి ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. అతడిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.