Ranbir kapoor Alia bhatt Marriage: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్.. పరిస్థితి అంతా బాగుండి ఉంటే ఇప్పటికే పెళ్లి పీటలెక్కాల్సింది. కానీ కరోనా సహా ఇతర కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీరి పెళ్లి తెరపైకి వచ్చింది. ఈ నెల 17న ఏడడుగులు వేయబోతున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అతితక్కువ మంది సమక్షంలో ఈ వేడుక జరగనుందట. ఇప్పటికే అతిథుల జాబితాను కూడా రెడీ చేశారని తెలిసింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ముంబయిలోనే వీరు పెళ్లి పీటలెక్కనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ ఎలా మొదలైంది? ఎలా సాగింది? వంటి విషయాల గురించి తెలుసుకుందాం..
మొదటినుంచి ఆలియాకు రణ్‌బీర్ కపూర్ అంటే చాలా ఇష్టమట! తన ఫస్ట్ క్రష్ కూడా అతడే. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా గతంలో ఓ సందర్భంలో చెప్పింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర రణ్‌బీర్ కపూర్ కొన్ని రోజులు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పుడు 'బ్లాక్' సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆలియా ఆ చిత్రంలో నటించాలని అనుకున్నారు. దీంతో అక్కడికి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చారు. ఆ సమయంలోనే అక్కడే ఉన్న రణ్‌బీర్‌పై క్రష్ ఫీలింగ్ కలిగిందట. అప్పుడు ఆమె వయసు 11ఏళ్లు కాగా, రణ్‌బీర్ ఆమె కంటే పదేళ్లు పెద్ద.
అయితే ఆలియాకు రణ్‌బీర్ ఫస్ట్ క్రష్ అయినప్పటికీ.. అతడి ఫస్ట్ క్రష్ మాత్రం ఆమె కాదు. ఆలియా కన్నా ముందు దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ సహా పలువురు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణం నడిపారని జోరుగా ప్రచారం సాగింది. ఆ హీరోయిన్లతో ఆలియాకు మంచి పరిచయం కూడా ఉందట. వీరితో బ్రేకప్ అయ్యాక ఆలియాతో రణ్‌బీర్‌కు మంచి స్నేహం ఏర్పడింది.
'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్లో సమయంలో వీరి స్నేహం మరింత దగ్గరైంది. అలా ఈ జంట మధ్య ప్రేమకు పునాది పడింది. అప్పటి నుంచి వీరు పలు చోట్ల షికార్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కి వార్తల్లో నిలిచారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఇదీ చూడండి: ఈ భామల కాల్షీట్లు ఫుల్.. ఇక సెట్లో హీరోలతోనే..