బాలయ్య సినిమా అంటేనే ఒక రేంజ్లో యాక్షన్ మాస్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఒక్క సారి వీరసింహం డైలాగ్ చెప్పిందంటే థియేటర్లు దద్దరిల్లుతాయి. అయితే ఆయన తాజాగా నటించిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి ఇటీవలే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. తనకెంతో నచ్చిందని.. 'వీర సింహారెడ్డి' దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి ప్రశంసించారు. ఈ విషయాన్ని గోపిచంద్ తెలిపారు.
"ఇది నాకొక అద్భుతమైన క్షణం. తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశానని, సినిమా తనకెంతో నచ్చిందని ఆయన నాతో చెప్పారు. మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు.. ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థ్యాంక్యూ రజని సర్" అని గోపీచంద్ మలినేని ట్వీట్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై 'వీర సింహారెడ్డి' నిర్మితమైంది. ఇందులో బాలయ్య.. తండ్రీకొడుకులుగా రెండు పాత్రలు పోషించారు. ఆయన సరసన శ్రుతిహాసన్, హనీరోజ్ నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.