రజనీకాంత్ సిల్వర్స్క్రీన్పైనే కాదు రియల్ లైఫ్‌లోనూ సూపర్‌స్టారే. ఆయన తాను సంపాదించే సంపాదనలో సగం వంతు పేద ప్రజల సహాయం కోసం ఖర్చు చేస్తుంటారు. ఈ మంచి మనసే ఆయన్ని సినీప్రియులకు, ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఇప్పుడీ స్థాయికి చేరిన రజనీ దగ్గర ఒకానొక సందర్భంలో రైలు టికెట్ లేకపోతే అక్కడి కూలీలు కొందరు సాయం చేసేందుకు ముందుకొచ్చారని మీకు తెలుసా?
సూపర్‌స్టార్ సినీ అవకాశాల కోసం మద్రాస్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన రోజుల్లో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు. "ఎస్సెసెల్సీ చదివేటప్పుడు ఇంట్లోవాళ్లు పరీక్షల ఫీజు కోసం రూ.150 ఇచ్చారు. అయితే పరీక్ష ఫెయిల్ అవుతానని నాకు ముందే తెలుసు. అందుకే మద్రాస్ రైలెక్కాను. కానీ, మార్గం మధ్యలో టికెట్ ఎక్కడో పడిపోయింది. టికెట్ ఇన్‌స్పెక్టర్‌కు ఆ విషయం చెప్పినా జరిమానా కట్టాల్సిందే అంటూ అందరి ముందూ అరిచారు. అప్పుడు ఐదుగురు కూలీలు నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకొచ్చారు. 'నేను టికెట్ తీసుకోలేదనుకుంటున్నారేమో. కానీ, నేను టికెట్ తీసుకున్న మాట వాస్తవం. ఆ విషయాన్ని టీసీకి చెబుతున్నా నమ్మడం లేదు' అన్నాను. అప్పుడు ఇన్‌స్పెక్టర్ నమ్మారు. అదే తొలిసారి నన్ను ఓ తెలియని వ్యక్తి నమ్మడం. ఆ తర్వాత మద్రాస్‌కు వచ్చాక కె.బాలచందర్ నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని గెలిపించాను. ఇప్పుడు ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కానియ్యను" అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు రజనీ.
ఇదీ చూడండి: వీరయ్య నుంచి బాలయ్య దాకా రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే