సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా ఇప్పటికే వెండితెరపై అనేక చిత్రాలు సందడి చేశాయి. ఈ క్రమంలోనే మరో మహోన్నత వ్యక్తి జీవిత కథ.. దృశ్యరూపంగా వచ్చేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడా విషయాన్ని మరో సారి స్పష్టం చేశారు. 'అటల్' శీర్షికన ఈ చిత్రం రూపొందనుండగా.. నటుడు పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు.
భాజపా సహ-వ్యవస్థాపకుడైన వాజ్‌పేయీ జీవిత ప్రస్థానం చుట్టూ కథ సాగుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వాజ్‌పేయీ పాత్రను పోషించటం గౌరవంగా భావిస్తున్నట్లు నటుడు, అటల్ పాత్రధారి పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. వాజ్‌పేయీ 99వ జయంతిని పురస్కరించుకొని వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అటల్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్‌సింగ్ తెలిపారు. కాగా, నిర్మాత సందీప్ సింగ్ గతంలో 'అలీగఢ్', 'సర్బ్‌జిత్', 'భూమి', 'పీఎం నరేంద్రమోదీ', 'ఝండ్' చిత్రాలను నిర్మించారు.
ఇదీ చూడండి: ఈషా రెబ్బా లొకేషన్ ఛేంజ్