Adipurush Review: చిత్రం: ఆది పురుష్; నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వస్తల్ సేథ్ తదితరులు; సంగీతం: అజయ్ -అతుల్; నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా; సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళణి; ఎడిటింగ్: అపూర్వ మోత్వాలే సాహాయ్, అనిష్ మహత్రే; నిర్మాత: భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్ రాజేశ్ నాయర్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్; విడుదల సంస్థ: యూవీ క్రియేషన్స్, పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ; విడుదల: 16-06-2023
వాల్మీకి విరచిత ఇతిహాసగాథ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. అజరామరమైన ఆ కావ్యాన్ని ఎంతో మంది దర్శకులు వెండితెరపై చూపించారు. ఇప్పుడు నేటి తరానికి ఆ 'రామాయణం' గొప్పతనాన్ని చెప్పే బాధ్యతను మరో అద్వీతీయ దర్శకుడు ఓం రౌత్ తీసుకున్నారు. ప్రభాస్ రాఘవుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'ఆది పురుష్'. సాంకేతిక హంగులతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది?
కథేంటంటే: వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. మర్యాద పురుషోత్తముడైన రాఘవ (ప్రభాస్) వనవాసం స్వీకరించడం నుంచి ఈ కథ మొదలవుతుంది. తన అర్ధాంగి, అపురూప సౌందర్యవతి అయిన జానకి (కృతిసనన్), సోదరుడు శేషు (సన్నీసింగ్)తో కలిసి సత్యం, ధర్మమే తన ఆయుధంగా వనవాసాన్ని గడుపుతుంటాడు. శత్రు దుర్బేధ్యమైన లంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీఖాన్) తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలు విని జానకిని అపహరిస్తాడు. ఆమెను తీసుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘవ ఏం చేశాడు? తరతరాలు చెప్పుకొనేలా సాగిన ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచిందన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే: ఈ తరం ఆడియన్స్ సినిమా చూసే తీరులో చాలా మార్పులొచ్చాయి. కట్టిపడేసేలా విజువల్స్, అబ్బుర పరిచేలా గ్రాఫిక్స్ హంగులు.. అద్భుత శక్తులతో కూడిన పాత్రల మేళవింపునే ఇప్పటి వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ అభిరుచుల్నే ప్రామాణికంగా తీసుకున్న దర్శకుడు .. రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలో రామాయణ ఇతిహాసంలోని ప్రామాణికతని పక్కనపెట్టి... సందర్భాలు, పాత్రల్ని సినిమాకి అనుకూలంగా ఆయన మార్చుకున్నారు. ప్రామాణికమైన వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవాలంటే పండితుల్ని, సాహిత్యకారుల్ని సంప్రదించాల్సిందేనంటూ ముందే చెప్పేసి సినిమాని ఆరంభించారు.
ఇక లంకేశ్ దీక్షని మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇవ్వడంతో అసలు కథలోకి వెళుతుంది సినిమా. అక్కడి నుంచి అందరికీ తెలిసిన రామాయణంలోని ప్రధాన ఘట్టాలే ఒక్కొక్కటిగా తెరపైకి వస్తుంటాయి. భారతీయులంతా ఏదో సందర్భంలో రామాయణం గురించి వినడం, ఆ గాథతో ఇదివరకే చాలా సినిమాలు రూపొందడం వల్ల కథ పరంగా పెద్దగా ఆసక్తిని రేకెత్తించదు. బంగారు లేడీ మాయ, సీతాపహరణం, వాలి-సుగ్రీవుల యుద్ధం, హనుమంతుడి సాయం, లంకాదహనం, వానర సైన్యంతో కలిసి రామసేతు నిర్మాణం, లక్ష్మణుడి ప్రాణాల్ని కాపాడటం కోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, రామరావణ యుద్ధం..ఇలా వరుస ఘట్టాలతో సినిమా ఆద్యంతం సాగుతుంది.
Adipurush Review : ముఖ్యంగా కథ కంటే కూడా విజువల్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు దర్శకుడు. లంకని తెరపై ఆవిష్కరించిన విధానం సినిమాకే హైలైట్. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆ సన్నివేశాల్ని ఎంతో నాణ్యంగా తీర్చిదిద్దారు. విజువల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టిన ఓం రౌత్.. భావోద్వేగాల్ని మాత్రం పట్టించుకోలేదు. ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచే గాథ ఇది. ఒకే ప్రాణంగా బతికిన జానకి, రాఘవ మధ్య ఎడబాటు.. హనుమంతుడి విన్యాసాలు, శ్రీరాముడి విలువలు, ఆయన పరాక్రమం తదితర నేపథ్యాల్ని వాడుకుని బలమైన భావోద్వేగాల్ని పండించే ఆస్కారం ఉన్నా దర్శకుడు.. ఇలాంటి విషయాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సేతు నిర్మాణానికి వానరసైన్యాన్ని సిద్ధం చేయడం, లంకలో రావణుడిపై పోరాటం కోసం సైన్యంలో స్ఫూర్తిని నింపే ఘట్టాలు మినహా ఏవీ హీరోయిజాన్ని హైలైట్ చేయలేకపోయాయి. యుద్ధ సన్నివేశాలు కూడా సుదీర్ఘంగా సాగినా అందులోనూ విజువల్సే తప్ప మిగిలిన అంశాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం అందరిని మెప్పిస్తుంది. కథ, కథనాల కంటే కూడా.. అంచనాలకి తగ్గట్టుగా నవతరం ప్రేక్షకులు, చిన్నారుల్ని అలరించే విజువల్స్‌తో రూపొందిన చిత్రమిది. త్రీడీలో ప్రేక్షకుల్ని మరింతగా అలరిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Adipurush Cast: నటీనటులు సినిమాపై చక్కటి ప్రభావం చూపించారు. రాఘవ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయారు. శ్రీరాముడిలోని సాత్వికత, ప్రశాంతత ఆయన ముఖంలోనూ కనిపించేలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. జానకి పాత్రకి తెరపైన ఎక్కువగా ప్రాధాన్యం దక్కలేదు. అయినా సరే, అందులో కృతిసనన్ చాలా హుందాగా, అందంగా కనిపించారు. రాముడికి తగ్గ సీత అనిపించుకున్నారు. ఇక లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ మంచి అభినయాన్ని ప్రదర్శించారు. ఆయన గెటప్ మాత్రం మరీ ఆధునికంగా కనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో సైఫ్ అలీఖాన్ నటన ఆకట్టుకుంటుంది. లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్ చక్కగా నటించారు. మిగిలిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు.
Adipurush Movie : సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉంది. విజువల్ మాయాజాలం తెరపై కనిపిస్తుంది. కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల అత్యుత్తమ పనితీరు కనిపిస్తుంది. సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. 'జై శ్రీరామ్', 'శివోహం', 'ప్రియమిథునం' అనే పాటల చిత్రీకరణ సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. అజయ్ - అతుల్ సమకూర్చిన బాణీలు ఎంత బాగున్నాయో, సంచిత్, అంకిత్ ద్వయం నేపథ్య సంగీతంతో అంతగా కట్టిపడేసింది. కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినట్టు అనిపిస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు ఓం రౌత్... భారతీయ ఇతిహాసం రామాయణాన్ని కమర్షియల్‌గా, ట్రెండీగా తెరపైకి తీసుకు రావడంలో విజయవంతమయ్యాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బలాలు
- + కట్టిపడేసే విజువల్స్
- + రాఘవగా ప్రభాస్, ఇతర ప్రధాన పాత్రలు
- + సంగీతం
- బలహీనతలు
- - సుదీర్ఘంగా సాగే కొన్ని సన్నివేశాలు
- - భావోద్వేగాలు కొరవడటం
- చివరిగా: ఆదిపురుష్... ఆధునిక హంగుల రామాయణం
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!