కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో NTR 30 సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 24న ఫిక్స్ చేసినట్లు గతంలో మూవీటీమ్ ప్రకటించింది. అయితే ఇప్పుడీ ప్రారంభోత్సవ తేదీలో మార్పులు జరిగాయి. సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ ఇంట్లో విషాధ ఛాయలు అలుముకోవటం వల్ల ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.
కాగా, జనతా గ్యారేజ్ తర్వాత.. కొరటాల శివ, ఎన్టీఆర్‌తో కలిసి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సినమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయినప్పటికీ అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు. కనీసం సెట్స్‌పైకి కూడా చిత్రాన్ని తీసుకెళ్లలేదు. అయితే ఇటీవల విడుదల అయిన కల్యాణ్‌రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఎన్టీఆర్ 30' మూవీకి సంబంధించి తారక్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 24న సినిమాకి క్లాప్, మార్చిలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిలో దీనిని రిలీజ్ చేసేందుకు షెడ్యుల్ ఖరారు చేసినట్లు వెల్లడించారు. అయితే తాజాగా తన సొదరుడి మృతితో బాధలోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. దీంతో ఆయన కాస్త కుదుట పడ్డాక కొత్త తేదీని ప్రకటిస్తామని తాజాగా సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్నారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ తెరంగేట్రం చేయనుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాగా, 'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ వాటికి సంబంధించిన పనులు కూడా ఇంకా మొదలవ్వలేదు.