'సీతారామం' సినిమాతో తెలుగు వారి మనసు దోచుకున్న భామ మృణాల్ ఠాకూర్. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ నటి తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఇందులో ఓ నెటిజన్ మృణాల్ మాట తీరును తప్పుబట్టాడు. తనకు కాబోయే భర్త గురించి మృణాల్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు చెప్పిన మాటలు జత చేస్తూ.. ఆమె రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోందని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. "కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో గతంలోనూ, ప్రస్తుతం నాకున్న అభిప్రాయాన్ని కనీసం నేను ధైర్యంగా చెప్పగలిగాను" అని బదులిచ్చింది. ఆమె ఇచ్చిన రిప్లైపై పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల విసిగిపోయిన ఆమె.. "నటీనటులు కూడా మనుషులేననే విషయాన్ని కొంతమంది వ్యక్తులు మర్చిపోతారనుకుంటా" అని తన అసంతృప్తిని తెలియజేసింది.
ఇదే చిట్‌చాట్‌లో ఆమె తన అభిరుచులను సైతం పంచుకున్నారు. తనకి మధురైలోని దేవాలయాలంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అలాగే, తనకు చీరలు నచ్చుతాయని, ఐరన్ మ్యాన్‌ను ఇష్టపడతానని, మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించే సూపర్‌హీరో సినిమాలో నటించాలనుందని ఆమె చెప్పింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తనకు కాబోయే భర్త మంచి వాడైతే చాలని, అందం అనేది విషయం కాదని చెప్పుకొచ్చింది. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆమె తనకు కాబోయే భర్త అందగాడై ఉండాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ట్విట్టర్ చాట్ నిర్వహించగా.. దీనిని గురించే ప్రశ్నించారు.