ప్రేమకథలు బోర్ కొట్టవు. ఎన్నొచ్చినా సరే.. మరో సినిమాని చూడటానికి సిద్ధమవుతుంటాడు ప్రేక్షకుడు. చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు. కుర్రకారు 'ఇది మా కథే' అనుకుంటారు, పెద్దవాళ్లు తమ జీవితాల్లోని ప్రేమని గుర్తు చేసుకుంటూ కనెక్ట్ అవుతుంటారు. పక్కాగా ఫీల్ పండితే చాలు.. అవి విజయవంతమైనట్టే.
వాళ్లూ మనసుపడ్డారు
ప్రేమకథలనగానే కొత్తతరం.. యువ కథానాయకులే గుర్తుకొస్తారు. వాళ్లతోనే ఎక్కువగా ఆ సినిమాలు రూపొందుతుంటాయి. కానీ ఈసారి అగ్ర తారలూ ప్రేమకథలపై మనసు పడ్డారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ అందుకో ఉదాహరణ. ఇది ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. విధిని కూడా ప్రేమ జయించగలదంటూ నిరూపించిన చిత్రమిది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసినా.. ప్రేమ కథల్లో మాత్రం ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రభాస్, పూజా హెగ్డే జోడీ మధ్య కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని దోచాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘విరాటపర్వం’ మరో ప్రేమకథ. రవన్న, వెన్నెల మధ్య విప్లవం నేపథ్యంలో ప్రేమకథ సాగుతుంది. దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభకి అద్దం పట్టిన చిత్రమిది. ఆయన ప్రేమనీ, ఉద్యమాన్నీ కలిపిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది.
పరిణయమే ప్రధానంగా..
నాగచైతన్య 'థ్యాంక్యూ', సుధీర్‌బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రాల్లో ప్రేమే ప్రధాన ఆకర్షణ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన 'థ్యాంక్యూ' ఓ యువకుడి జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందిన చిత్రమిది. తన గతాన్ని మళ్లీ ఎలా నెమరేసుకున్నాడు? తన జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్లని కలుసుకుని వాళ్లకి ఎలా కృతజ్ఞతలు చెప్పాడన్నది ఈ కథలో కీలకం. ప్రేమ ఇతివృత్తం ఈ చిత్రానికి కీలకం. సుధీర్‌బాబు కథానాయకుడిగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఓ కమర్షియల్ దర్శకుడి చుట్టూ సాగే కథ. ఇందులోనూ ప్రేమ కీలకం. ఈ ఏడాది చివరి పేజీలో కనిపించిన మరో ప్రేమకథ '18 పేజెస్'. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సామాజిక మాధ్యమాలు లేని, ప్రేమలేఖలు రాసుకున్న కాలాన్ని గుర్తు చేసిన ప్రేమకథ ఇది. మంచి ఫీల్‌తో ఓ మంచి ప్రయత్నం అనిపించుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో..
యుద్ధంతో రాసిన ప్రేమకథగా 'సీతారామం' ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రమిది. ఈ ఏడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రేమకథ కూడా ఇదే. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ నిర్మించింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. సైన్యంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ రామ్, ఆయనకి లేఖ రాసిన సీతామహాలక్ష్మి చుట్టూ సాగే ప్రేమకథ ఇది. మొదట దక్షిణాదిలో, ఆ తర్వాత హిందీలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమైంది.