జబర్దస్త్‌లో కన్ఫ్యూజన్ స్కిట్లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు వెంకీ మంకీ. తనపై తానే వేసుకొనే జోక్‌లు ఎన్నోసార్లు పేలాయి. అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతడు.. దానికోసమే ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నట్లు తెలిపాడు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన వెంకీ.. జబర్దస్త్‌లో తన ప్రయాణం, లేడీ గెటప్ కష్టాలు సహా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు.
"జబర్దస్త్ మొదలైన 14వ ఎపిసోడ్ తర్వాత నా మిమిక్రీ షో చూసి చంద్ర అన్నా నన్ను పిలిచాడు. అతనే నాకు ఈ రోజు ఈ జీవితాన్ని ఇచ్చాడు. చంద్ర టీమ్‌లో ఓ 30 ఎపిసోడ్లు చేశాను. ఆ తర్వాత రాఘవ టీమ్‌లో 50 స్కిట్లు చేస్తే.. అందులో 45కి పైగా లేడీ గెటప్‌లే. వినోదిని రాకముందు లేడీ గెటప్‌ల క్రెడిట్ నాకే ఉండేది. ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ వేణు అన్నా టీమ్‌లోకి వెళ్లాను. అక్కడ స్కిట్ రాయడం, టైమింగ్ లాంటివి నేర్చుకున్నా. ఆ తర్వాత టీమ్‌లీడర్‌గా అవకాశం వచ్చింది. ఇప్పటికీ ఐదేళ్లు అవుతుంది. నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో కన్ఫ్యూజన్ థీమ్‌తో స్కిట్లు చేస్తున్నాను. వాటివల్లే నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి." అని వెంకీ తెలిపాడు.
"లేడీ గెటప్‌లు వేయడం అంత ఈజీ కాదు. మేకప్ చాలా హెవీ ఉంటుంది. విగ్, చీరలో ఉండటం కష్టం. ఆడవారు ఎదుర్కొనే ఇబ్బందులు అప్పుడే మనకు అర్థమవుతాయి. జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే వారికి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే చీరకట్టుకొని నడవడమే కష్టం. అలాంటిది జంప్‌లు, ఫైటింగ్, డాన్సులు వేయడం కత్తిమీదసామే."
-వెంకీ, కమెడియన్
ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని: "నాకు చిన్నప్పటి నుంచి గుంపులో ఒకడిగా కాకుండా ప్రత్యేకంగా ఉండటమే ఇష్టం. అందుకోసం మంచి ఉద్యోగం వచ్చినా వదులుకున్నాను. అప్పుడు చాలా మంది కోప్పడ్డారు. కానీ నాకుంటూ గుర్తింపు ఉండాలనుకున్నాను. జబర్దస్త్, ఈటీవీ దయవల్ల నేను జనాల్లోకి వెళ్లిపోయాను. ప్రతిఒక్కరూ నన్ను వారి కుటుంబసభ్యుడిలా భావిస్తున్నారు. జబర్దస్త్ స్టేజ్‌పై ఒకటి, రెండు స్కిట్లలో మంచి ప్రదర్శన చేస్తే సినిమా ఆర్టిస్ట్ స్థాయిలో పేరు వస్తుంది. నాకు సింగరేణిలోని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ మిమిక్రీలో గోల్డ్ మెడలిస్ట్‌ని. ఆ తర్వాత రేడియో జాకీ, సింగరేణితో పాటు కొన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అందరూ సింగరేణికి వెళ్లమన్నారు. అయితే నేను మాత్రం.. నేను సాధించాల్సింది వేరే ఉందని దానిని వదులుకున్నా. ఎందుకంటే పుట్టేది ఒకసారే, చచ్చేది ఒకసారే. పుట్టిన ఊరిలోనే కాదు.. మన గురించి ప్రపంచానికి తెలియాలని అనుకున్నా. ఆ విధంగానే చాలా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. దానికి కారణం జబర్దస్తే." అని వెంకీ చెప్పాడు.
ఇదీ చూడండి: 'జబర్దస్త్ వల్లే మా అమ్మకు మంచి వైద్యం.. కానీ ఆ విషయంలో మాత్రం..'