నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. దీని గురించి చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. "ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో నాగచైతన్య మునుపెన్నడూ చేయని పాత్ర పోషిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల మూడో వారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. చైతూతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం" అని తెలిపారు. ఇది చైతూకి తొలి తమిళ సినిమా కాగా.. దర్శకుడు వెంకట్‌కు తొలి తెలుగు చిత్రం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు.
'ఉగ్ర' రూపంలో నరేష్
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉగ్రం'. 'నాంది' వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా మేనన్ కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. సోమవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో నరేష్ పాత్రను సీరియస్ లుక్‌లో ఆసక్తికరంగా చూపించారు. "ఉత్కంఠభరితంగా సాగే ఓ వినూత్నమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. నరేష్ ఓ విలక్షణమైన పాత్రలో కనిపిస్తారు" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కథ: తూము వెంకట్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సిద్.
ఇదీ చదవండి:
అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగ్.. ఏంటంటే?