- చిత్రం పేరు: ఎఫ్3
- నటీనటులు: వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రఘుబాబు, అలీ, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు
- దర్శకత్వం: అనిల్ రావిపూడి
- సంగీతం: దేవిశ్రీప్రసాద్
- నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
- విడుదల: 27-05-2022
ఎఫ్ 2 తర్వాత మోర్ ఫన్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్. ఈ సారి డబ్బు చుట్టూ తిరిగే కథను రాసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి... ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరీ ఎఫ్ 3 నిజంగానే ఎఫ్ 2కు మించిన వినోదాన్ని పంచిందా, ఎఫ్ 4 తీసే అవకాశాన్ని ఇస్తుందా లేదో ఈటీవీ భారత్ సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఇదీ కథ: వెంకీ (వెంకటేష్)కి ఇంటి నిండా సమస్యలే. సవతి తల్లి పోరు ఒకపక్క... సమస్యలు మరో పక్క. వాటి నుంచి బయటపడేందుకు అడ్డదారుల్లో సంపాదనపై దృష్టిపెడతాడు. వరుణ్ (వరుణ్‌తేజ్) ఖరీదైన కలలు కనే యువకుడు. కానీ చేతిలో మాత్రం చిల్లిగవ్వ ఉండదు. అతను ఎలాగైనా ధనవంతులైన కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమలో పడేసి ఆమెని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటాడు. హనీ (మెహ్రీన్) కూడా తన కుటుంబం సమస్యల నుంచి గట్టెక్కాలంటే ధనికుడైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే మార్గం అనుకుంటుంది. అలా వరుణ్, హనీ ధనవంతుల పిల్లలుగా నటిస్తూ ఒకరికొకరు దగ్గరవుతారు.
వరుణ్ డబ్బున్నవాడిగా కనిపించేందుకు వెంకీ తన ఇల్లు తాకట్టుపెట్టి మరీ పెట్టుబడి పెడతాడు. కానీ వాళ్లందరి అసలు రంగు బయటపడుతుంది. ఒకరినొకరు మోసం చేసుకున్నామని అర్థమవుతుంది. సమస్యల నుంచి గట్టెక్కకపోగా అందరూ మరింత అప్పుల్లో కూరుకుపోతారు. ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న దశలో... ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీశర్మ) గురించి తెలుస్తుంది. చిన్నప్పుడే తన నుంచి దూరమైన వారసుడి కోసం వెదుతుకున్న ఆయన ఇంటికి వరుస కడుతుంది వెంకీ, వరుణ్ బ్యాచ్. మీ వారసుడిని నేనంటే నేనంటూ పోటీ పడతారు. మరి ఆనంద్ ప్రసాద్ తన వారసుడిగా ఎవరిని స్వీకరించారు? వీళ్లందరూ డబ్బు సమస్యల నుంచి ఎలా గట్టెక్కారనేదే ఎఫ్ 3 చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే?: లాజిక్ అనీ... రియలిస్టిక్ అనీ మమ్మల్ని ఎంతకాలం దూరం పెడతారంటూ ఒకప్పటి తెలుగు సినిమా స్టైల్ పోలీస్ అధికారిగా తనికెళ్ల భరణి క్లైమాక్స్‌లో వచ్చి ఏకరువు పెడతాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ అరిగిపోయిన డైలాగ్ చెప్పి నవ్వులు పూయిస్తాడు. అచ్చం ఈ డైలాగ్‌కి తగ్గట్టుగానే... ఇప్పుడొస్తున్న రియలిస్టిక్ కథల మధ్య లాజిక్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీసినట్టున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. కొంతకాలంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న భారీదనం, యాక్షన్ సినిమాల మధ్య ఆహ్లాదంగా సాగుతూ వినోదాన్ని పంచుతుందీ చిత్రం. కాకపోతే ఈ సినిమా చూస్తున్నప్పుడు లాజిక్ లెక్కలకి దూరంగా ఉండాల్సిందే. ఇలా ఎలా సాధ్యం? అనే ప్రశ్న మొదలైతే మాత్రం ఈ సినిమాని ఆస్వాదించలేరు. ఆ లెక్కలకి దూరంగా పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తే మాత్రం ఎఫ్2ని మించి వినోదాన్ని ఆస్వాదించొచ్చు.
పాత్రలన్నీ అత్యాశతో వ్యవహరిస్తుంటాయి. అందుకోసం అడ్డదారులు తొక్కుతుంటాయి. ఆ క్రమంలో పండే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. రేచీకటి సమస్యని కప్పి పుచ్చుకునేందుకు వెంకటేష్ పడే పాట్లు ఫస్టాప్ లో హైలెట్‌గా నిలుస్తాయి. వెంకట్రావు పెళ్లాన్ని చూశా... అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ప్రతిసారీ నవ్వించింది. నత్తితో బాధపడుతూ వరుణ్‌తేజ్ రకరకాల మేనరిజమ్స్‌ని ప్రదర్శించిన తీరు చాలా బాగుంటుంది. పాత సినిమాల పాటల్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ నవ్వించిన తీరు బాగుంది. సెకండాఫ్ లో కథంతా విజయనగరంలోని ఆనంద్ ప్రసాద్ ఇంటికి మారుతుంది. వారసులం మేమంటే మేమంటూ తమన్నాతో సహా పోటీపడటం, వాళ్లకి రకరకాల పరీక్షలు పెట్టడం ఆ నేపథ్యంలో పండే వినోదంతో సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. పిల్లలను సెల్ ఫోన్ లకు దూరం పెట్టి చదువులపై దృష్టి సారించేలా ఎఫ్ 3 టాయ్స్ పేరుతో ప్రభాస్, బన్నీ, మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి కథానాయకుల్ని చూపించడం, పతాక సన్నివేశాల్లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో ఫైట్లు చేయించిన తీరు పైసా వసూల్ సూత్రానికి తగ్గట్టుగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే: ఎఫ్2లో కో బ్రదర్స్‌గా హుషారుగా కనిపించి, మంచి టైమింగ్‌ని ప్రదర్శించిన వెంకటేష్, వరుణ్‌తేజ్ ఇందులో మరింతగా సందడి చేశారు. ఇద్దరి మధ్య కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. వెంకటేష్ తన ఇమేజ్‌ని పక్కనపెట్టి రేచీకటి బాధితుడిగా నవ్వించిన తీరు హైలెట్. వరుణ్‌తేజ్ కూడా అవలీలగా కామెడీ పండించాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాత్రలో ఒదిగిపోయాడు. రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సునీల్, అలీ, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై.విజయ... తెరనిండా కనిపించే పాత్రలన్నీ వాళ్ల వాళ్ల నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు. ద్వితీయార్థంలో ఆ మోతాదు మరింతగా పెరుగుతుంది.
తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ అల్లరి ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం సినిమాపై ప్రభావం చూపించాయి. పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. పూజాహెగ్డేపై చిత్రీకరించిన పాట కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ముందు నుంచి చెబుతున్నట్లుగా మరింత నవ్వించడానికే ఈ కథను సిద్ధం చేశారు. ఆద్యంతం నవ్వించేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఎఫ్ 4 కూడా ప్రకటించేశారు. అయితే అది ఎఫ్ 3కి వచ్చే వసూళ్లను బట్టి ఉంటుందని ముందే దర్శక నిర్మాతలు చెప్పేశారు. నిర్మాణ పరంగా ఇంత మంది నటులతో సినిమాని నిర్మించడం విశేషమనే చెప్పాలి.
- బలాలు: హాస్యం, వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల నటన, పతాక సన్నివేశాలు
- బలహీనతలు: తెలిసిన కథే, లాజిక్ లేని సన్నివేశాలు
- చివరగా: F3... కడుపుబ్బా నవ్వాల్సిందే.
ఇదీ చదవండి: పాన్ ఇండియా సినిమాలపై కమల్ ఆసక్తికర కామెంట్స్