సాధారణంగా సెలబ్రిటీల, వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి మనలో చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా వారికి పుట్టిన పిల్లలను చూసేందుకు తెగ ఆరాటపడుతుంటారు. వారు ఇంట్లో ఎలా ఉంటారేనిది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ప్రేక్షకుల మనసులు తెలుసుకున్న కొందరు ఫొటోగ్రాఫర్లు ఎలా అయినా వారి ఫొటోలను పోస్ట్ చేసి సంపాదించాలనుకుంటారు. మరి కొంతమంది అయితే లైక్‌లు, షేర్ల కోసం రిస్క్ చేసి మరీ ప్రముఖుల ఇంటి విషయాలను బయటపెడుతుంటారు. గతంలో విరాట్- కోహ్లీ కుమార్తె వామిక ఫొటోలను తీసేందుకు వారి ఇంట్లోకి ఫొటోగ్రాఫర్లు చొరబడి దొరికిపోయారు. ఇప్పుడే ఇదే పరిస్థితి బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ ఎదుర్కుంటున్నారు. అసలేం జరిగిందంటే?
గతేడాది బాలీవుడ్ స్టార్ యాక్టర్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్ ఇచ్చింది. నవంబరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి ఆ జంట రాహా కపూర్ అని పేరు పెట్టింది. కానీ ఇంతవరకు ఆమె ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. మరో రెండేళ్ల వరకు చూపించమని కూడా ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పట్లో చూపిస్తారన్న నమ్మకం లేదనుకున్నారేమో గానీ ఇద్దరు ఫొటోగ్రాఫర్లు.. ఆలియా ఇంట్లో సీక్రెట్ కెమెరాను పెట్టేశారు. ఈ విషయాన్ని ఆలియా గమనించింది. వారిద్దరికి గట్టి షాక్ కూడా ఇచ్చింది.
తాజాగా ఆలియా.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "నేను ఎంతో సరదాగా మధ్యాహ్న సమయంలో ఇంట్లో గడుపుతున్నాను. ఆ సమయంలో నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించి మొత్తం పరిశీలించి షాక్ అయ్యాను.. మా పక్కింటి టెర్రస్‌పై ఇద్దరు వ్యక్తులు చేతిలో కెమెరాలు పట్టుకొని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఇది మా ప్రైవసీకి భంగం కలిగించడమే.. ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేశారు.. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా..?" అంటూ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా ఆ పోస్ట్‌కు ముంబయి పోలీసులకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పు అని అంటున్నారు. కచ్చితంగా పోలీసులు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.