తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'మాస్టర్' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు త్రిష, సూర్య, సంజయ్‌దత్, అర్జున్, నివిన్ పౌలీ లాంటి భారీ తారాగణంతో రూపొందనుందనే సమాచారంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర షూటింగ్ చెన్నైలోని ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతున్నట్టు నటుడు మనోబాల మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో భాగమయ్యామంటూ గౌతమ్‌మేనన్, మన్సూర్ అలీఖాన్ ఇదివరకే తెలిపారు.
ఈ కాంబో సూపర్‌హిట్..
విజయ్, త్రిష కాంబోలో పలు హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరు కలిసి 'గిల్లి', 'కురువి', 'తిరుపాచి','ఆతి' వంటి అనేక చిత్రాలలో పనిచేశారు. అయితే 2008లో రిలీజైన 'కురువి' తర్వాత వీరిద్దరు కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించలేదు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ కాంబోతో సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. మరోసారి తమ 'గిల్లి' జంట తెరపై రచ్చ చేయనున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.