Dhanush interview grey man: స్టార్ నటులుగా ఎదిగిన ఎంతోమంది తమ కెరీర్ ప్రారంభంలో అవమానాలు ఎదుర్కొన్నారు. వారిలో కోలీవుడ్ హీరో ధనుష్ ఒకరు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. 'తుల్లువదో ఇలమై' అనేది ధనుష్ నటించిన తొలి చిత్రం. ఈ సినిమాకి ఆయన తండ్రి కస్తూరి రాజా దర్శకుడు. సినిమా హిట్ అందుకున్నా 'హీరో.. లుక్ బాలేదు. అది హీరో మెటీరియల్ కాదు' అంటూ అప్పట్లో చాలామంది అన్నారట. ఆ తర్వాత తన అన్నయ్య సెల్వ రాఘవన్ నిర్మించిన 'కాదల్ కొండెయిన్'లో నటించాడు ధనుష్. ఈ సినిమా చిత్రీకరణలోనే తనకు ఘోర అవమానం జరిగిందని ధనుష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నటుడు విజయ్ సేతుపతి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూ అది.
"కాదల్ కొండెయిన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 'ఈ సినిమాలో హీరో ఎవరు?' అని సెట్స్‌కి వచ్చిన కొందరు నన్ను అడిగారు. అప్పటికే లుక్ పరంగా ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం వల్ల మరోసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో వేరే అతణ్ని చూపించి, అతనే హీరో అని చెప్పా. అయినా ఫలితం లేకపోయింది. చివరకు నేనే హీరోనని వారికి తెలిసింది. 'హేయ్ చూడండ్రా.. ఇడుగో ఆటో డ్రైవర్.. ఇతనే ఈ సినిమా హీరో' అంటూ నన్ను చూసి అందరూ నవ్వారు. అప్పుడు వారిని నేనేం అనలేకపోయా. నా కారులో కూర్చొని బాగా ఏడ్చా. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది నన్ను అలా ట్రోల్ చేశారు. 'బాడీ షేమింగ్' విమర్శలు గుప్పించారు. ఆటో డ్రైవర్ అయితే మాత్రం హీరో కాలేడా? కాకూడదా?" అని ధనుష్ తన బాధను వ్యక్తం చేశారు.
అగ్లీ ఫేస్ టు 'సెక్సీ తమిళ్ ఫ్రెండ్'..: తొలి నాళ్లలో 'అగ్లీ ఫేస్' అంటూ అవహేళన చేసిన వారే ఇప్పుడు ధనుష్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ధనుష్ తమిళంలో వరుస సినిమాలు చేసి, మంచి విజయాలు అందుకున్నారు. అలా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దృష్టినీ ఆయన ఆకర్షించారు. 'ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' తర్వాత ధనుష్ నటించిన ఆంగ్ల చిత్రం 'ది గ్రే మ్యాన్'. ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్' వేదికగా ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా 'నెట్‌ఫ్లిక్స్'.. ధనుష్‌తో ఓ వీడియో రూపొందింది. ఇందులో.. 'ఒకవేళ నటుడిగా కెరీర్ ప్రారంభిస్తున్న దశలో ఉంటే మీకు మీరు ఏం సలహా ఇచ్చుకుంటారు?' అనే ప్రశ్నకు ధనుష్ తనదైన మార్క్ సమాధానమిచ్చారు. "నీ లుక్ గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకు. నీ పని నువ్వు నిజాయతీగా చేసుకుంటూ వెళ్లిపో. ఏదో ఒకరోజు హాలీవుడ్ హీరో నిన్ను 'సెక్సీ తమిళ్ ఫ్రెండ్' అని పిలుస్తాడు" అని ధనుష్ బదులిచ్చారు.
'ది గ్రేన్ మ్యాన్' నటుల్లో ఒకరైన క్రిస్ ఇవాన్స్ ఈ చిత్రంలో ధనుష్‌ను ఇలానే పిలుస్తారు. ఈ సినిమాలో ధనుష్.. అవిక్‌సాన్ అనే పాత్ర పోషించారు. 'రఘువరన్'తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించిన ధనుష్ త్వరలోనే నేరుగా తెలుగు సినిమాతో సందడి చేయనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న 'సార్' అనే సినిమా అక్టోబరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. తర్వాత, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ తెలుగు సినిమా చేయనున్నారు.
ఇవీ చదవండి: ఈ బాలీవుడ్ స్టార్స్‌కు సూపర్ క్రేజ్.. కానీ వీరు అసలు భారతీయులే కారు!
Ramarao on Duty Heroine: దివ్యాంన్ష కౌశిక్ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్.. ఓ లుక్కేయండిలా..