2018 Movie Oscar Entry : ఆస్కార్ 96వ ఆకాడమీ అవార్డ్స్ రేసు నుంచి '2018' మలయాళ చిత్రం ఔటైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ శుక్రవారం ప్రకటించిన 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో ఈ సినిమా పేరు లేదు. ఈ విషయాన్ని 2018 మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అయితే ఈ మూవీ లిస్ట్‌లో లేకపోవడం మూవీ లవర్స్‌ను కాస్త నిరాశకు గురి చేసింది! అయితే ఝార్ఖండ్ గ్యాంగ్‌రేప్ ఆధారంగా తెరకెక్కిన 'టు కిల్ ఎ టైగర్' అనే డాక్యుమెంటరీ మాత్రం బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో ఎంపికైంది.
మరోవైపు 2018 సినిమా ఆస్కార్ రేసు నుంచి ఔటవ్వడం పట్ల ఆ మూవీ డైరెక్టర్ తన బాధను వ్యక్తం చేశారు. తనకు ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞలతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. ''అందరికీ నమస్కారం. తాజాగా ఆస్కార్ షార్ట్‌లిస్ట్ విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 88 అంతర్జాతీయ భాషా చిత్రాల్లో చివరి 15 చిత్రాల్లో మా చిత్రం '2018:ఎవ్రీ వవ్ ఈజ్ ఏ హీరో' స్థానాన్ని పొందలేకపోయింది. ఇలా మీ అందరినీ నిరాశపరిచినందుకు నా శ్రేయోభిలాషులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఏది ఏమైనప్పటికీ, ఈ పోటీలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నేను జీవితాంతం ఆదరించే కలలాంటి ప్రయాణం. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం, ఆస్కార్‌కి అధికారికంగా భారతీయ ప్రవేశం లభించడం ఏ చిత్రనిర్మాత కెరీర్‌లో అరుదైన విజయమే".అంటూ జూడ్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ అసాధారణ ప్రయాణం కోసం నన్ను ఎంచుకున్నందుకు నేను దేవుడికి నేను కృతజ్ఞుడను. మా సినిమాను ఆదరించిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ప్రత్యేకించి రవి కొట్టారక్కర వారి అపరిమితమైన మద్దతు, ప్రేమ, మా చిత్రాన్ని భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని ఆయన మూవీ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.
2018 Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే టొవినో థామస్, కుంచకో బొబన్ లాంటి మలయాళ స్టార్స్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా '2018'. దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను.. ఆద్యంతం భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషల్లోనూ రిలీజై పాజిటివ్ టాక్ అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డుకెక్కింది. అయితే ఈ సినిమా విడుదలైన మే 5నే 'ది కేరళ స్టోరీ' కూడా థియేటర్లలో విడుదలైంది. ఇలా కేరళ రాష్ట్రంతో ముడిపడి ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు ఆడియెన్స్ ముందుకు రావడం గమనార్హం.