ATTACK: అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామ మహిళా దళిత సర్పంచి శిఖా విజయలక్ష్మి పట్ల వైకాపా నాయకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భర్త యాకోబు, కుమారుడు నవీన్‌ను చంపేస్తామని బెదిరించారు. ఎస్సై ప్రతాప్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామ శివారులోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు సర్పంచికి సమాచారం వచ్చింది. ఆమె తన భర్త, కుమారుడితో చెరువు వద్దకెళ్లి దీనిపై ప్రశ్నించారు. వైకాపా నాయకులు మాచర్ల మధు, సురేశ్ వారిని దుర్భాషలాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో వైకాపా నాయకుడు మాచర్ల ఏసోబు సర్పంచి కుమారుడిని చంపేయాలని మిగిలినవారిని ఉసిగొల్పాడు. ‘నావైపు ఎమ్మెల్యే ఉన్నారు... మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని సర్పంచి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి కేసు నమోదైంది.
తెదేపా కార్యాలయంలో తలదాచుకున్న సర్పంచి: గుంటూరులోని తెదేపా కార్యాలయంలో సర్పంచి విజయలక్ష్మి, భర్త యాకోబు, కుమారుడు నవీన్ తలదాచుకున్నారు. ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అనంతరం ఇంటికి వెళ్లేందుకు భయపడి వారు తెదేపా జిల్లా నాయకులకు సమాచారమిచ్చారు. అర్ధరాత్రి గుంటూరుకు చేరుకుని పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.
ఇవీ చదవండి: