How to Recycling Electronic Waste in AP : ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లేని ఇల్లు ఉందా? సెల్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఏసీలు మన జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటికీ ఎక్స్‌పైర్ డేట్ ఉంటుంది. కాలపరిమితి ముగియగానే వాటిని ఏ పాత సామాన్లవాడికి వేసేస్తాం లేకుంటే బయట పడేస్తాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. భారీ స్థాయిలో పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలు మానవాళి మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. అందుకే ఈ-వేస్ట్‌ను జాగ్రత్తగా డిస్పోజ్ చేసేందుకు 'ఒప్పో' ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. అదేంటో చూద్దాం రండి.
ఈ-వేస్ట్ రీసైక్లింగ్ : ప్రపంచంలో నిత్యం 50 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో మెర్క్యురీ, లెడ్, కాడ్మియం వంటి లోహాలు చాలా ప్రమాదకరం. వీటితో పర్యావరణ కాలుష్యంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ-వేస్ట్‌ను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయకపోతే వచ్చే అనర్థాలెన్నో. అందుకే ఈ-వ్యర్థాలను జాగ్రత్తగా రీ సైకిల్ చేయటం ద్వారా కొన్ని వస్తువులు, లోహాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో రాగి, వెండి, బంగారం వంటివి కూడా ఈ వేస్ట్ ద్వారా సేకరించవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల తయారీలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఈ-వేస్ట్ రీసైక్లింగ్లో మాత్రం చాలా వెనుకబడింది. పోగయ్యే ఈ-వ్యర్థాల్లో 20 శాతం కూడా రీసైక్లింగ్ జరగట్లేదు.
పర్యావరణ పరిరక్షణ కోసం ట్రిపుల్ ఆర్ : ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా నడుం బిగించింది. అఖిలభారత సాంకేతిక విద్యామండలితో ఒప్పందం కుదుర్చుకుని ఒక్కో బ్యాచ్‌లో 5వేల మంది ఉండేలా మొత్తం 10లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్శిటీ కూడా ఈ ప్రక్రియలో భాగస్వామమైంది. ఈ-వేస్ట్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, రీ సైక్లింగ్ ఆవశ్యకత, శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పించనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే ట్రిపుల్ ఆర్ సూత్రాన్ని పాటిస్తామని ఒప్పో కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
"ఈ-వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఒప్పో ఇండియా ప్రధానంగా 'ట్రిపుల్ ఆర్' సూత్రంపై దృష్టి సారించింది. యువత, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ-వేస్ట్ నిర్వహణకు రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ విధానాన్ని అమలు చేస్తాం. ఇంట్లో చెత్తను డిస్పోజ్ చేసినట్లు ఎలక్ట్రానిక్ పరికరాలను చేయకూడదు. ఎందుకంటే ఈ-వేస్ట్‌ను కాల్చేటప్పుడు విషపూరిత వాయువులు వెలువడతాయి. అందుకే శాస్త్రీయ విధానంలో డిప్పోజ్ చేయాలి. అప్పుడే విలువైన వస్తువులను కూడా తిరిగి వినియోగించగలం."- రాకేశ్ భరద్వాజ్, ఒప్పో ఇండియా ప్రతినిధి
విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి : ఎలక్ట్రానిక్ పరికరాల్లోని విడిభాగాలను వేరు చేసేటప్పుడు వెలువడే విషపూరిత వాయివులు ప్రజలకు ముప్పును తెస్తాయి. అందుకే వాటిని కట్టడి చేసేలా ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌పై శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ-వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి తద్వారా ప్రజల్లోనూ చైతన్యం నింపేలా కార్యాచరణ రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ-వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్‌పై ప్రత్యేక పాలసీలను రూపొందించి అప్‌గ్రేడ్ చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.
ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దీని కోసం విద్యార్థులను ముందుగా సమాయత్తం చేస్తున్నాం. పర్యావరణ విద్యలో భాగంగా ప్రత్యేక కోర్సు ద్వారా మొదటి సంవత్సరం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఇది క్యాంపస్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడి నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. అంతేకాదు దగ్గర్లోని గ్రామాలకు వెళ్లి ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌పై చైతన్యం నింపుతారు. రంగ భాష్యం, పర్యావరణ విభాగాధిపతి, ఎస్ఆర్ఎం వర్శిటీ
అన్నింటికీ ఒకటే ఛార్జర్.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా భారత్ అడుగులు!