Warangal Cricket betting gang arrest: పెరుగుతున్న పట్టణీకరణ, సాంకేతికతో మంచితో పాటు చెడూ పెరుగుతోంది. బెట్టింగ్, డ్రగ్స్ వంటి దందాలు గ్రామాలకూ పాకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో భారీ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలు అభయ్, ప్రసాద్ అరెస్టు చేసి.. నిందితుల నుంచి రూ.2.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసులు తెలిపారు. ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లో గత 3 నెలల నుంచి బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వివిధ బ్యాంకులకు చెందిన 43 పాసు పుస్తకాలు.. ఏటీఎం కార్డులు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ తరుణ్ జోషి వివరించారు.
ప్రధాన నిర్వాహకులు ముంబయిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు కొందరు ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. వారికి పాస్వర్డ్స్ ఇచ్చారు. ఇలా ఒక లింక్ క్రియేట్ చేసి కస్టమర్లకు పంపిస్తున్నారు. మాకు 8 ఫోన్లు దొరికాయి. అన్ని ఫోన్లలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. లింక్స్ ద్వారా కస్టమర్లు బెట్టింగ్ చేస్తున్నారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ పూర్తయింది. ఇప్పుడు ఇండియా-న్యూజిలాండ్ సిరీస్ జరుగుతోంది. ప్రతీ మ్యాచ్‌కు ఓవర్ టూ ఓవర్ లేకపోతే బాల్ టూ బాల్ బెట్టింగ్ చేస్తున్నారు. ఏ టీమ్‌కు విన్నింగ్ ఛాన్స్ ఉంది అని బెట్టింగ్ చేస్తున్నారు.
-తరుణ్ జోషీ, వరంగల్ సీపీ
యువత బీ కేర్‌ఫుల్
బెట్టింగ్ దందా మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తోందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు ముంబైలో ఉన్నట్లు గుర్తించామని.... అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్లు తెలిపారు. యువత బెట్టింగ్ మాయలో పడి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని అక్రమార్కుల పాలుచేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
'క్రికెట్ బెట్టింగ్‌లో కేసులను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కస్టమర్లు ఓడిపోతే ఇరవై శాతం లాభాలు ఇక్కడి వాళ్లు, 80 శాతం ప్రధాన నిర్వాహకులు తీసుకుంటున్నారు. లాభాల మార్జిన్‌ను బట్టీ ఈ విధంగా తీసుకుంటున్నారు.'
-తరుణ్ జోషీ, వరంగల్ సీపీ
మత్తుదందాపై ఉక్కుపాదం
క్రికెట్ బెట్టింగ్(Cricket betting)తో పాటు, మత్తుదందాపైనా(Ganja smuggling) ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు... గంజాయి రహిత వరంగల్ లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక కార్యచరణతో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. పాత నేరస్థులు, పాన్‌షాపుల యజమానులతో సమావేశాలు నిర్వహిస్తూ... గంజా భూతాన్ని పారదోలేందుకు శ్రమిస్తున్నామని సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
RTC BUS FALLS IN TO VALLEY: ఎగువ అహోబిలం రహదారిలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు