Murder Attempt On Ex MPP In Tuni : తుని.. గురువారం ఉదయం 6 గంటల సమయం.. తెదేపా నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి భవాని మాలధారణలో భిక్ష కోసం వచ్చారు. శేషగిరిరావు బియ్యం వేస్తుండగా ఒక్కసారిగా కత్తి బయటకు తీశాడు. తలపై నరికేందుకు యత్నించగా.. అప్రమత్తతో ఉన్న శేషగిరిరావు వెంటనే తప్పించుకున్నారు. కానీ మరోసారి చేతిపై దాడి చేసిన దుండగుడు.. వెంటనే అక్కడినుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు. శేషగిరిరావు చేతికి, తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరిరావును యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొండబాబు సహా ఇతర తెదేపా నేతలు పరామర్శించారు. మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులే దాడి చేశారని ఆరోపించారు. వైకాపా ఆగడాలకు తుని జనం భయభ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు.
శేషగిరిరావుపై హత్నాయత్నాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మంత్రి దాడి శెట్టి రాజా అవినీతి, అక్రమాలపై పోరాడినందుకే శేషగిరిరావుని హత్య చెయ్యాలని కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్ గొడ్డలిపోటును మంత్రులు, ఎమ్మెల్యే లు వారసత్వంగా తీసుకున్నారని విమర్శించారు. అన్యాయాలను నిలదీసే తెదేపా నేతల గళాలను.. అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్‌ను నమ్ముకుంటే లాభం లేదని వైకాపా నేతలు కత్తిని నమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు.
శేషగిరిరావు ఫిర్యాదు మేరకు తుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని.. ఆధారాలు సేకరించారు. శేషగిరిపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: