ARREST: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో దారి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాజేంద్ర విలేకరుల సమావేశం ఈ వివరాలు వెల్లడించారు. గత నెల 26వ తేదీన పెద్ద బోధనం గ్రామ సమీపంలో వెంకటసుబ్బారెడ్డి అనే వృద్ధుడిని అటకాయించి కత్తులతో బెదిరించి అతని వద్ద నుంచి రూ.4.80లక్షల చోరీ చేశారని ఏఎస్పీ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో ఓక్కిలేరు వంతెన వద్ద చంద్రశేఖర్ అనే వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి రెండు లక్షల దోచుకున్నారని వెల్లడించారు.
ఈ రెండూ చోరీలకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. విచారణలో భాగంగా సీసీ ఫుటేజీలను ఆధారంగా తీసుకొని నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన సురేంద్ర, రుద్రవరం మండలం పెద్ద కమ్మలూరు గ్రామానికి చెందిన చిన్న నరసింహులు అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.6.80లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులిద్దరు జల్సాలకు అలవాటుపడి బ్యాంకుల వద్ద ఒంటరిగా డబ్బుతో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వారిని అరెస్టు చేయడంలో కృషిచేసిన ఆళ్లగడ్డ సీఐ రాజశేఖర్ రెడ్డి ,పట్టణ సీఐ కృష్ణయ్య ,ఎస్సై నర్సింహులను ఏఎస్పీ రాజేంద్ర అభినందించారు.
ఇవీ చదవండి:
- రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తుదిదశకు చేరుకున్న కసరత్తు.. నేడో, రేపో కేసీఆర్ ప్రకటన
- అందం పెట్టుబడి.. బలహీనతే రాబడి.. ప్రేమ ముసుగులో కి'లేడి' మోసాలు