బాపట్లలోని ఇస్లాంపేటలో బక్రీద్ రోజున జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి.. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఇస్లాంపేటలో బక్రీద్ రోజున తురుమెళ్ల అభిలాష్, మంగళగిరి ఇమ్మాన్యుయేల్.. తమ మిత్రులతో కలిసి బడ్డీ కొట్టు దగ్గర ఉన్నారు. అదే సమయంలో.. స్థానికులైన రెహమాన్, పఠాన్ నుజ్మల్ (బుజ్జి), సయ్యద్ రహీమ్ అనే ముగ్గురు.. మద్యం సేవించి ద్విచక్రవాహనాన్ని నడుపుతున్నారు. అభిలాష్, ఇమ్మాన్యుయేల్ మిత్ర బృందం ఉన్న చోటు నుంచి దురుసుగా వెళ్లారు. ఈ ఘటనలో.. వారిలో ఒకరి కాలుపై నుంచి బైక్ వెళ్లింది. కాసేపటికే.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి.. తోపులాట వరకూ వెళ్లింది. స్థానికులు కలగజేసుకుని సర్దిచెప్పగా.. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
అయినా.. వాళ్లు మనసులో కక్షను కొనసాగించుకున్నారు. మరుసటి రోజు అదే బడ్డీ కొట్టు దగ్గర ఉన్న రెహమాన్ మిత్రబృందం వద్దకు.. అభిలాష్, అతని మిత్రులు రెండు వాహనాలపై వెళ్లారు. తమను బైక్ తో ఎందుకు ఢీ కొట్టారని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలన్నారు. తిరస్కరించిన రెహమాన్ తీరుతో.. ఇరు వర్గాల మధ్య మళ్లీ కొట్లాట మొదలైంది. అభిలాష్ తో పాటు అతని మిత్రులపై.. రెహమాన్ కత్తితో దాడికి దిగాడు. అభిలాష్ తో పాటు.. ఇమ్మాన్యుయేల్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వారి మిత్రులు ప్రథమ చికిత్స చేయించారు. అక్కడి నుంచి.. గుంటూరు జీజీహెచ్ లో మెరుగైన చికిత్స నిమిత్తం చేర్పించారు.
ఈ ఘటనపై.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాపట్ల వన్ టౌన్ పోలీసులు స్పందించారని.. ఇప్పటికే రెహమాన్, పఠాన్ నుజ్మల్, సయ్యద్ రహీమ్ ను అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.
ఇదీ చదవండి:
'కుటుంబ సభ్యులే చంపాలని చూశారు.. ఆ ఘటనతో నా ప్రియుడికి ఎటువంటి సంబంధం లేదు'