Today Crime News: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో సోదరుడు..తన అన్నావదినలను రాడ్డుతో కొట్టి పట్టపగలే దారుణంగా హత్యచేశాడు. పట్టణానికి చెందిన 60ఏళ్ల నీలాకరం మోషే, ఆయన భార్య సరోజమ్మ..కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఉదయం ఇంటి వద్ద ఉన్న ఇద్దరిని..మోషే సోదరుడు యేసయ్య తలపై రాడ్డుతో కొట్టాడు. అక్కడికక్కడే దంపతులు ఇద్దరు చనిపోయారు. ఆస్తి తగాదాలతోనే హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విశాఖలో కంటైనర్‌ను ఢీకొట్టి కారులో వెళ్తున్న వృద్ధ దంపతులు మృతి చెందారు.
అప్పు తాళలేక రైతు ఆత్మహత్య..
ఐదునెలల కిందట ఒకేరోజు తల్లిని, భార్యను కోల్పోయాడు. ఆరోజు నుంచి మనోవేదనకు గురవుతూ, ఉన్న రెండెకరాల పొలం అమ్ముకున్నాడు. వేరే వారి దగ్గర పొలం గుత్తకు తీసుకుని పంట సాగు చేసినా, నష్టం రావడంతో పాటు 4 లక్షల అప్పు మిగిలింది. ఈ బాధలన్నింటిని భరించలేక గ్రామ శివారుకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆనంద్ (50)అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో జరిగింది. చనిపోయిన వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటస్వామి చెప్పారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బిక్కవోలు ఎస్సై బుజ్జిబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు చాకలి చెరువు దగ్గర రోడ్డుపై ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని ఎస్సై తెలిపారు.
కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు..
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం సమీపంలోని అద్దంకి బ్రాంచ్ కాలువలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిని మార్టూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన వంశీ (13),రాబర్ట్ ఇసాక్(15)లుగా గుర్తించారు. విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కదిరిలో మహిళ దారుణ హత్య..
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని కాలేజి రోడ్డులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ప్రమీలమ్మను గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కదిరి డీఎస్పీ భవ్య కిషోర్, సిఐ సత్యబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆటో బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
గుంటూరు జిల్లాలోని దేచవరం-విప్పర్లరెడ్డిపాలెం మార్గంలో ఆటో బోల్తాపడి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులను రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు.
అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త
అనంతపురం జిల్లా పామిడి మండలం అనుంపల్లిలో భార్యను చంపిన ఘటన చోటుచేసుకుంది. భార్య మాధవి మీద అనుమానంతో శివ బ్లేడ్‌తో గొంతు కోసి చంపాడు.
ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ యువతి గొంతు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి... కుటుంబ సభ్యుల ఆందోళన
విశాఖ జిల్లా ఎలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో పసిబిడ్డ మృతి చెందడం వివాదాస్పదంగా మారింది.ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని సోమలింగపాలెం గ్రామానికి చెందిన పచ్చి కూర హైమా అనే గర్భిణీ డెలివరీ కోసం ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పురుడు పోసే క్రమంలో పుట్టిన మగ బిడ్డ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక వైకాపా నాయకులు... బాధిత కుటుంబంతో మాట్లాడి విరమింపజేశారు.
కంటైనర్‌ను ఢీకొట్టి కారు... వృద్ధ దంపతులు మృతి
విశాఖ జిల్లా కసింకోట మండలం ఎన్జీ పాలెం వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
అనంతపురంలోని చెరువు కట్ట రోడ్డులో కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు పట్టణంలోని పాతూరు ప్రాంతానికి చెందిన బాలరాజుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ... ఒకరికి తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం ఆర్టీసీడిపోకు చెందిన అద్దె బస్సు... గజపతినగరం మండలం జక్కువ నుంచి విజయనగరం వెళ్తోంది. మార్గమధ్యలో బొండపల్లి మండలం గొట్లాం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిలిచిన బస్సును... వెనక నుంచి లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చదవండి: Viveka Murder Case: ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ