Crime News: విశాఖ జిల్లా గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో ఎస్ఈబీ పోలీసుల నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేశారు.
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన తనయుడు
గుంటూరు జిల్లా నరసరావుపేట రామిరెడ్డిపేట సమీపంలో అస్తి కోసం కొడుకు... కన్న తల్లిని హతమార్చాడు. ఆస్తి వివాదంలో తల్లి శివమ్మను కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడు వెంకట్రావు అక్కడి నుంటి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు... దర్యాప్తు చేపట్టారు
ఆటో ఢీకొని బాలుడు మృతి
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఏ-ముప్పాళ్లలో ఆటో ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. బాలుడు ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో బాలుడిని ఢీకొని తల పైనుంచి దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు.
లారీ ఢీకొని మతిస్థిమితంలేని వ్యక్తి మృతి
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం శుద్ధగొమ్ము గ్రామం వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కాలిబాటన వెళ్తున్న మిట్టపల్లి రమేష్ (30) అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన రమేష్‌కు మతిస్థిమితం సరిగా లేదని.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేసాడని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రంపచోడవరం వైపు నడిచి వెళ్తుండగా.. ఎదురుగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నాటుసారా బట్టీలపై పోలీసుల దాడులు
విశాఖ జిల్లా గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో నాటుసారా తయారీ బట్టీలపై ఎస్ఈబీ పోలీసులు దాడులు నిర్వహించారు. జీడి మామిడి, సరుగుడు తోటల్లో బట్టీలను ఏర్పాటు చేసి గిరిజన గ్రామాలకు సరఫరా చేయడంతో పాటు.. సమీపంలోని మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు చేశారు. 1,999 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
బియ్యం అక్రమంగా తరలిస్తున్న 5 లారీలు సీజ్
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు తీసుకెళ్తున్నట్లు డ్రైవర్లు చెప్పారని తెలిపారు. రెవిన్యూ సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చామని... అవి ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యమా కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు.
శిరివెళ్లలో సస్పెన్షన్‌లో ఉన్న ఎస్ఐ ఆత్మహత్య
కడప జిల్లా బద్వేలు అగ్నిమాపకశాఖలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శిరివెళ్ల మండలం రాజనగరం గ్రామానికి చెందిన దోనే ఓబులేసు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 6 నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన ఆయన తెల్లవారుజామున గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్థిక లావాదేవీలతో వ్యక్తి దారుణ హత్య !
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపాల్‌నగర్ శివారులో నివసిస్తున్న మోకా వెంకటేశ్వరరావుపై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా.. కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించనప్పటీ ఫలితం లేకుండా పోయింది.
విషయం తెలుసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు అప్పు తీసుకొని చెల్లించటంలో జాప్యం చేస్తున్నాడని.., ఆర్థిక లావాదేవీల కారణంగానే కత్తితో దాడికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో వెంకటేశ్వరరావు మృతదేహానికి శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నివాళులర్పించారు.
అనుమానాస్పదస్థితిలో బాలుడి మృతి..
చిత్తూరు జిల్లా కలికిరి మండలం అద్దావారి పల్లి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రవి కుమారుడు ఉదయ్ కిరణ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు..బాలుడి అచూకీ లభ్యం కాకపోవటంతో నిన్న రాత్రి పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా..ఈరోజు సాయంత్రం గ్రామ శివారులోని ఓ చెట్టుకు బాలుడి మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాలుడి ముఖంపై గాయాలుండటంతో ఇది హత్యేనని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి